Share News

‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌’.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:57 PM

ఉగ్రవాదంపై భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దీటైన జవాబిస్తామని స్పష్టం చేశారు.

‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌’.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi on Mann Ki Baat

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2016లో సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019లో బాలాకోట్‌ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్‌ సిందూర్‌లను గురించి నేటి మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు మోదీ. భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దీటైన జవాబిస్తామని స్పష్టం చేశారు.


నేటి 138వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ భద్రత సహా జనగణన, పర్యావరణ పరిరక్షణ, పోషకాహారం, యువత, క్రీడలు, సాంస్కృతిక వారసత్వం వంటి పలు అంశాలను ప్రస్తావించారు మోదీ. ఈ సందర్భంగా.. జనగణనను జాతీయ బాధ్యతగా అభివర్ణించారు. ఈ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని మొధేరా గురించి మాట్లాడుతూ.. సూర్యారాధన భారతీయ సంప్రదాయంలో ఆలయాలు, నిర్మాణాలకే పరిమితం కాకూడదన్నారు ప్రధాని. కాంతి, శక్తి, విజ్ఞానం సహా నిరంతర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. మొధేరా దేశంలోని తొలి సౌర గ్రామంగా గుర్తింపు పొందిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.


అస్సాంలో వన్యప్రాణుల సంరక్షణ, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పిగ్మీ హాగ్‌ పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలపైనా నేటి మన్ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడారు. సుందర్‌బన్స్‌లోని మహిళలు మడ అడవులను పెంచుతూ తమ గ్రామాలను కాపాడుకుంటున్నారని, తద్వారా వారు ఉపాధి పొందుతున్నారని వివరించారు. 'నషా ముక్త్‌ యువ అభియాన్‌' ద్వారా యువత మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా చైతన్యం కల్పిస్తున్నారని మోదీ తెలిపారు. అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండకుండా.. వారికి తోడుగా ఉంటూ బయటపడేలా చూడాలని సూచించారు.


వీటితో పాటు థాయ్‌లాండ్‌లో గణేశుడి ఆరాధనకు పెరుగుతున్న ఆదరణను కూడా మోదీ ప్రస్తావించారు. అక్కడ గణనాథుడిని 'ఫ్రా ఫికానెట్‌' రూపంలో పూజిస్తారని, చియాంగ్‌మైలో వినాయక విగ్రహాలకు ప్రత్యేక మ్యూజియం ఉందని తెలిపారు. అటు.. ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన బావులు, కోనేరులకు పునర్వైభవం తీసుకొస్తున్నామని కూడా చెప్పారు మోదీ. ముంబైలో సముద్రతీర ప్రాంతాలను శుభ్రం చేయడం, ఢిల్లీ యువత చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమాలు చేపట్టడం సహా బెంగాల్‌లోని పర్యాటక ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

శాంతిని కోరుకున్నామంటే బలహీనమని కాదు: రాజ్‌నాథ్ సింగ్

ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..

Updated Date - Sep 27 , 2026 | 02:00 PM