Share News

శాంతిని కోరుకున్నామంటే బలహీనమని కాదు: రాజ్‌నాథ్ సింగ్

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:34 PM

జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌పై పొరుగుదేశం ఉగ్రవాదులను ఉసిగొల్పినంత కాలం గట్టిగా బదులు చెప్తామని పాకిస్తాన్‌కు ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

శాంతిని కోరుకున్నామంటే బలహీనమని కాదు: రాజ్‌నాథ్ సింగ్

ఇంటర్‌నెట్ డెస్క్: జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌పై పొరుగుదేశం ఉగ్రవాదులను ఉసిగొల్పినంత కాలం గట్టిగా బదులు చెప్తామని పాకిస్తాన్‌కు ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిఫెన్స్ సమిట్ 2026లో ఆయన మాట్లాడారు. భారత్ మొదటి నుంచీ శాంతిని కోరుకుందని, యుద్ధాన్ని కాదన్నారు. అలాగే, ఒక దేశంపై దాడికి భారత్ ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ‘భారత్ శాంతిని కోరుకుంటుంది. యుద్ధాన్ని కాదు. ఒక దేశ భూభాగంపైనా కన్ను వేయదు. అయితే, శాంతియుత వాతావరణాన్ని కోరుకున్నంత మాత్రాన మనం బలహీనులమని కాదు. శాంతికి, బలహీనతకు తేడా ఉంది. మన దేశ భద్రత విషయంలో రాజీపడబోం. దేశంపై మళ్లీ ఉగ్రదాడి చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మన పొరుగు దేశం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తే, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే పొరుగు దేశానికి, ప్రపంచానికి మేము చెప్పాలనుకుంటున్నాం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.


సాధారణంగా భారత్ చర్చలపై విశ్వాసం ఉంచుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, ఆ చర్చలకు అక్కడికక్కడే తెరపడుతుందన్నారు. జాతీయ భద్రతను పణంగా పెట్టి పొరుగు దేశం నుంచి సహకారాన్ని కోరుకోబోమని ఆయన తేల్చిచెప్పారు. కాగా.. పాకిస్తాన్‌లో ఉంటున్న ఉగ్రవాదులు గత కొన్నేళ్లలో భారత్‌పై దాడికి పాల్పడ్డారని భారత్ ముందు నుంచీ చెబుతోంది. నిరుడు ఏప్రిల్ 22న కూడా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవారులు దాడి చేసి 26 మందిని చంపిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?

పాక్‌కు ఉగ్రవాదం అలవాటైంది: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్

Updated Date - Sep 27 , 2026 | 12:42 PM