Share News

రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:43 AM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు.

రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
MK Stalin

ఇంటర్‌నెట్ డెస్క్, జులై 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. నీట్ పరీక్షను నిలిపివేయడమే విద్యార్థుల సమస్యలకు ఏకైక పరిష్కారమని పేర్కొన్నారు. ‘రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి’ అని డిమాండ్ చేశారు.


ఈ వ్యవస్థ పూర్తిగా విఫలం..

నీట్ ప్రవేశపెట్టిన మూడు ప్రధాన లక్ష్యాల్లోనూ ఈ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్టాలిన్ ఆరోపించారు. విద్యలో సమాన అవకాశాలు కల్పించడం, పారదర్శకత పెంచడం, నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలు సాధించడంలో నీట్ విఫలమైందని విమర్శించారు. పాఠశాల విద్యా వ్యవస్థను బలహీనపరిచి, కోచింగ్ సెంటర్ల ఆధిపత్యాన్ని పెంచే పరిస్థితిని నీట్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు.


కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి..

విద్యార్థుల ఆవేదన, ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన వైఖరిని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. సామాజిక న్యాయాన్ని పరిరక్షించాలంటే నీట్ రద్దు అత్యవసరమని స్పష్టం చేశారు. గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నీట్ అన్యాయం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ‘Ban NEET, Save Students’ అనే నినాదంతో విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గుడ్ న్యూస్.. తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్ర ఆమోదం

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

రామచందర్ రావును వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 12:05 PM