భర్తను హతమార్చి పాముకాటుగా చిత్రీకరణ.. భార్య, ప్రియుడికి మరణశిక్ష!
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:09 PM
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను గొంతునులిమి చంపిన కేసులో భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్లకు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను గొంతునులిమి చంపి, ఆ హత్యను పాముకాటుగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్లకు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. నేరం జరిగిన ఏడాదిన్నర లోపే న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు నివేదిక ప్రకారం...
బహుసుమ ప్రాంతంలోని అక్బర్పూర్ సాదత్ గ్రామానికి చెందిన అమిత్ కశ్యప్ను 2025 ఏప్రిల్ 12 రాత్రి అతని భార్య రవిత, ప్రియుడు అమర్దీప్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహంపై ఒక పామును వదిలిపెట్టి.. అతను పాముకాటు వల్లే మరణించాడని నమ్మించేందుకు నాటకమాడారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అమిత్ది హత్యేనని తేలడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలించారు. హత్య జరిగిన రోజునే ఆ ఇద్దరూ 50 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు తేలింది.
మరోవైపు శిక్ష ఖరారు చేసే ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు.. దోషులను సంప్రదించింది. తమ పిల్లలను, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలని కోరుతూ రవిత, అమర్దీప్లు న్యాయమూర్తి ముందు కన్నీరుమున్నీరుగా విలపించారు. దర్యాప్తులో భాగంగా 60 రోజుల్లోనే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 12 మందికి పైగా సాక్షులను విచారించిన న్యాయస్థానం అక్టోబర్ 7న వారిని దోషులుగా తేల్చి.. తాజాగా మరణశిక్ష విధించింది. మీరట్లో ఇటీవల బ్లూ డ్రమ్ హత్య కేసులోనూ మరణశిక్ష పడటం గమనార్హం. అలానే గత మూడు రోజుల్లో మీరట్లో నలుగురు దోషులకు మరణశిక్ష పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో
సింగరేణి కార్మికులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్