Share News

క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్.. ఒకే టీమ్‌లో పురుషులు, మహిళలు!

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:47 PM

క్రికెట్‌లో మరో సరికొత్త ఫార్మాట్‌ ప్రారంభం కానుంది. పురుషులు, మహిళలు కలిసి ఒకే జట్టు తరఫున ఆడేలా ‘టెస్ట్‌ ట్వంటీ’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ మిక్స్‌డ్ జెండర్ క్రికెట్ టోర్నీలో ఇరువురూ వేర్వేరుగా మ్యాచ్‌లు ఆడినా.. రెండు జట్ల స్కోర్లను కలిపి విజేతను నిర్ణయిస్తారు.

క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్.. ఒకే టీమ్‌లో పురుషులు, మహిళలు!
Test Twenty Cricket

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో మరో సరికొత్త ఫార్మాట్‌ ప్రారంభం కానుంది. పురుషులు, మహిళలు కలిసి ఒకే జట్టు తరఫున ఆడేలా ‘టెస్ట్‌ ట్వంటీ’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ మిక్స్‌డ్ జెండర్ క్రికెట్ టోర్నీలో ఇరువురూ వేర్వేరుగా మ్యాచ్‌లు ఆడినా.. రెండు జట్ల స్కోర్లను కలిపి విజేతను నిర్ణయిస్తారు. అంటే ఒకే జట్టులోని మహిళలు, పురుషుల ప్రదర్శనకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్రికెట్‌లో నాలుగో ఫార్మాట్‌గా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ టోర్నీ తొలి ఎడిషన్‌ నవంబర్‌ 14 నుంచి 29 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. సింహాలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (ఎస్‌ఎస్‌సీ) మైదానం ఈ వినూత్న టోర్నీకి వేదిక కానుంది.


ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 13 నుంచి 21 ఏళ్ల వయసున్న 160 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. వీరిని నాలుగు జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో 40 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు ఉంటారు. మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు ప్రత్యర్థి అమ్మాయిల జట్టుతో, అబ్బాయిల జట్టు ప్రత్యర్థి అబ్బాయిల జట్టుతో తలపడుతుంది. అయితే, రెండు మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కలిపి జట్టు మొత్తం స్కోరుగా పరిగణిస్తారు. ఆ ఉమ్మడి స్కోరు ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు.


టాస్‌ దగ్గరి నుంచే కొత్త పద్ధతి..

ఈ ఫార్మాట్‌లో టాస్‌కు కూడా ప్రత్యేకత ఉంది. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయాలా? బౌలింగ్‌ చేయాలా? అనే నిర్ణయంతో పాటు అమ్మాయిల మ్యాచ్‌ ముందుగా జరగాలా? అబ్బాయిల మ్యాచ్‌ ముందుగా జరగాలా? అనేది కూడా నిర్ణయించవచ్చు. ఈ విధానాన్ని ‘పారిటీ రూల్‌’గా పేర్కొంటున్నారు. టెస్ట్‌ ట్వంటీ మ్యాచ్‌లు ఒక్క రోజులో 80 ఓవర్ల పాటు జరుగుతాయి. తొలి 40 ఓవర్లను పగటి సమయంలో ఎర్ర బంతితో, తెల్ల దుస్తుల్లో ఆడతారు. మిగిలిన 40 ఓవర్లు ఫ్లడ్‌లైట్ల వెలుగులో తెల్ల బంతితో, రంగుల దుస్తుల్లో నిర్వహిస్తారు. తొలి సెషన్‌లో చేసిన పరుగులను రెండో సెషన్‌లో కొనసాగిస్తారు. ఇలా రెండు సెషన్ల స్కోర్లను కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తారు.


దిగ్గజాల మద్దతు..

ఈ వినూత్న ఫార్మాట్‌కు మాజీ క్రికెట్‌ దిగ్గజాలు ఏబీ డివిలియర్స్‌, మాథ్యూ హేడెన్‌, సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ సలహా మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్‌ శర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీతో పాటు మైక్‌ ఫోర్డ్‌హామ్‌ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహణ కొనసాగనుంది. టెస్ట్‌ ట్వంటీ వ్యవస్థాపకుడు గౌరవ్‌ బహిర్వానీ మాట్లాడుతూ.. యువ క్రికెటర్లకు ప్రత్యేక వేదిక కల్పించడంతో పాటు అమ్మాయిలు, అబ్బాయిల ప్రతిభకు సమాన గుర్తింపు ఇవ్వడమే ఈ ఫార్మాట్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు, ఎస్‌ఎస్‌సీకి కృతజ్ఞతలు చెప్పారు. టెస్ట్‌ ట్వంటీ ద్వారా క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గెలవడం.. కలిసి ఓడిపోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫార్మాట్‌ విజయవంతమైతే యువ క్రికెటర్లకు కొత్త అవకాశాలు అందడంతో పాటు మహిళా, పురుష క్రికెట్‌కు సమాన ప్రాధాన్యం కల్పించే దిశగా కీలక అడుగుగా నిలిచే అవకాశం ఉంది. అయితే, ఈ వినూత్న విధానం మైదానంలో ఎలా పనిచేస్తుంది? అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది? అనేది తొలి టోర్నీతో తేలనుంది.


ఇవి కూడా చదవండి:

విండీస్‌తో ఐదో టీ20: అర్ష్‌దీప్‌ సింగ్‌కు గాయం.. భువీకి పిలుపు

మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్

Updated Date - Oct 16 , 2026 | 04:47 PM