అదరగొడుతున్న సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్.. 173 పరుగులతో విధ్వంసం!
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:57 PM
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నాడు. తాజాగా అండర్-19 స్థాయిలో జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నాడు. తాజాగా అండర్-19 స్థాయిలో జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగన ఆర్యవీర్.. చండీగఢ్‌పై ఓపెనర్‌గా వచ్చి భారీ శతకంతో చెలరేగాడు. 143 బంతుల్లోనే 173 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం.
18 ఏళ్ల ఆర్యవీర్ ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల యువ వన్డే సిరీస్‌లో మొత్తం 109 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 47 పరుగులు. ఇప్పుడు వినూ మన్కడ్ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్‌తో తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. మరోవైపు, ఈ టోర్నీలో ఢిల్లీ జట్టు గ్రూప్-ఈలో చివరి స్థానంలో కొనసాగుతోంది. జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నా.. ఆర్యవీర్ మాత్రం తన బ్యాటింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
ద్రవిడ్ తనయుడు కూడా..
వినూ మన్కడ్ ట్రోఫీలో మరో దిగ్గజ క్రికెటర్ కుమారుడు కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక అండర్-19 జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీతో పాటు కేవలం 41 బంతుల్లో 85 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌తో ఐదో టీ20: అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం.. భువీకి పిలుపు
మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్