Share News

మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:46 PM

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తొలిసారి మాట్లాడాడు. మద్యానికి బానిస కావడం, విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోవడం, ఆందోళన, పానిక్‌ అటాక్స్‌తో ఇబ్బందులు పడినట్లు వెల్లడించాడు.

మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్
Yuzvendra Chahal

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తొలిసారి మాట్లాడాడు. మద్యానికి బానిస కావడం, విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోవడం, ఆందోళన, పానిక్‌ అటాక్స్‌తో ఇబ్బందులు పడినట్లు వెల్లడించాడు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గుర్తించి.. మద్యానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రాతో తాజాగా జరిగిన పాడ్‌కాస్ట్‌లో చాహల్‌ పలు విషయాలను పంచుకున్నాడు.


‘యంగేజ్ నుంచే పార్టీలు వెళ్లే అలవాటు ఉంది. 2011లో తొలిసారి ఐపీఎల్‌ ఆడాను. అప్పట్లో ఏబీ డివిలియర్స్‌ ఒకసారి నాతో మాట్లాడుతూ.. జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యమని చెప్పాడు. ఆ మాట వినడానికి సులభంగానే ఉన్నా.. ఆచరించడం అంత సులభం కాదు. విడాకుల తర్వాత పరిస్థితులు చేయి దాటిపోయాయి. మానసికంగా కుంగిపోయా. గతేడాది కౌంటీ క్రికెట్‌ ఆడిన తర్వాత మద్యం విషయంలో హద్దులు దాటుతున్నానని అనిపించింది. దీంతో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేరి 26 రోజుల పాటు ఉన్నాను. ఇప్పుడు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. క్రికెట్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌లో కూడా మెరుగ్గా రాణిస్తున్నా. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. సోషల్ మీడియాలో నాపై చాలానే విమర్శలు వచ్చాయి. అలాగని ప్రతి కామెంట్‌కూ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటిని పక్కన పెట్టి నా పని నేను చూసుకుంటున్నా’ అని చాహల్ వెల్లడించాడు.


సరదాగా చేస్తున్నారని అనుకున్నా..

ఓ క్రికెటర్ 15వ అంతస్తులోని బాల్కనీ నుంచి తనను వేలాడదీదశాడని గతంలో చాహల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా చాహల్ మాట్లాడాడు. ‘అప్పుడు బెంగళూరులో ఆర్సీబీ పార్టీ ఇచ్చింది. నేనప్పుడు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఆ పార్టీలో అప్పటికే ఓ వ్యక్తి బాగా తాగేసి ఉన్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్లేయర్ అనుకుంటా. కానీ వాళ్లు సైమండ్స్, ఫ్రాంక్లిన్ కాదు. నన్ను పిలిచి పైకి ఎత్తాడు. సరదాగా చేస్తున్నారు లే అనుకున్నా. కానీ బాల్కనీ వద్ద నన్ను కిందకి వేలాడదీసేందుకు ప్రయత్నించాడు. అతడి మెడను గట్టిగా పట్టుకుని ఉన్నా. గదిలోకి అందరూ షాకై చూస్తున్నారు. కాసేపటికి అందరూ కలగజేసుకుని నన్ను బయటకు లాగారు. అప్పటికీ అతడు బాగా నవ్వుతూ కనిపించాడు. నాకైతే అది పునర్జన్మలాగా అనిపించింది’ అని చాహల్ తెలిపాడు.


ఇవీ చదవండి:

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

Updated Date - Oct 16 , 2026 | 02:46 PM