Share News

పునర్విభజన బిల్లుపై కేంద్రం కసరత్తు.. ప్రత్యేక సమావేశం దిశగా అడుగులు..?

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:48 AM

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పునర్విభజన బిల్లుపై కేంద్రం కసరత్తు.. ప్రత్యేక సమావేశం దిశగా అడుగులు..?
Parliament Special Session

న్యూఢిల్లీ: ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ బిల్లులకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం నిర్వహణపై కేంద్రం కసరత్తు చేస్తోందని, త్వరలోనే సమావేశ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.


కాగా, మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను ఏప్రిల్ 17న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, ఆ బిల్లుకు అవసరమైన మద్దతును కూడగట్టడంలో కేంద్రం విఫలమైంది. మరోవైపు, నీట్ పేపర్ లీక్‌పై ప్రతిపక్షాల నిరసనలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ చర్యల నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో బిల్లులను తిరిగి ప్రవేశపెట్టాలన్న కేంద్రం ప్రయత్నాలు ముందుకు సాగలేదు. దీంతో ఈ ప్రతిపాదనలను మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తనకు మద్దతిచ్చే పార్టీల సంఖ్యను పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకేతో కేంద్రం చర్చలు జరుపుతోందని సమాచారం. అలాగే, మరికొన్ని చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, అక్టోబర్ 26, 27 తేదీల్లో పార్లమెంట్‌లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఇండియా కూటమి ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

లండన్‌ వీధిలో స్పృహ కోల్పోయిన రాజకుటుంబ సభ్యురాలు.. కోర్టు చర్యలు.!

వాళ్లంతా నీ స్నేహితులే కదా.. రాహుల్ గాంధీకి ఖర్గే చురకలు..

Updated Date - Oct 16 , 2026 | 12:13 PM