Share News

ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు.. తదుపరి కార్యాచరణపై చర్చ

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:51 AM

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఇండియా కూటమి ఎంపీలకు ఢిల్లీలో లంచ్‌ ఏర్పాటు చేశారు.

ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు.. తదుపరి కార్యాచరణపై చర్చ
Mallikarjun Kharge

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఇండియా కూటమి ఎంపీలకు ఢిల్లీలో లంచ్‌ ఏర్పాటు చేశారు. జనపథ్‌ రోడ్‌ సమీపంలోని సాగర్‌ రత్న రెస్టారెంట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన కూటమి ఎంపీలు ఈ భేటీకి హాజరు కానున్నారు.


మంగళవారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు అక్కడే ధర్నాకు దిగారు. అనంతరం రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాతి రోజే ఖర్గే ఎంపీలతో విందు భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


తదుపరి కార్యాచరణపై చర్చ

ఈ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన తదుపరి నిరసన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లడంపై చర్చ జరగనుంది. ఈసీతో సమావేశం కోరుతూ ఎంపీలు లేఖపై సంతకాలు చేసే అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌ అంశాలపై ఇండియా కూటమి ఇప్పటికే ఉమ్మడి ఆందోళనలకు పిలుపునిచ్చింది. తాజాగా ఈసీ కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్‌ కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఖర్గే నిర్వహిస్తున్న తాజా భేటీ అనంతరం ప్రతిపక్ష కూటమి నుంచి ఎలాంటి నిరసన కార్యక్రమాలు ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 07 , 2026 | 11:51 AM