మనం గెలవడం కొందరికి ఇష్టం లేదు.. అర్జెంటీనా ఏకతాటిపై రావాలి: మెస్సి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:09 AM
జాతీయ జట్టు తరఫున చివరిసారిగా బరిలోకి దిగిన మెస్సి.. మ్యాచ్ అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనాను 3-0 తేడాతో గెలిపించాడు. జాతీయ జట్టు తరఫున చివరిసారిగా బరిలోకి దిగిన మెస్సి.. మ్యాచ్ అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారాయి. అర్జెంటీనా ఓటమిని కోరుకునే వారు ఉన్నారని, దేశమంతా ఏకతాటిపై ఉండాలని సూచించాడు.
‘అర్జెంటీనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికీ ధన్యవాదాలు. ఇన్నేళ్లుగా నాపై మీరు చూపించిన ప్రేమ, గౌరవం, మద్దతును జీవితాంతం నా హృదయంలో దాచుకుంటా. నిజం చెప్పాలంటే.. నేను ఇంత ఎక్కువగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. జీవితాంతం ఇక్కడే, ఈ జెర్సీతో మీ ముందు ఆడాలని ఉంది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. నా జీవితంలో నెరవేరాల్సిన కలలు పూర్తయ్యాయి. ప్రపంచకప్ గెలవాలన్న నా కల, మొత్తం దేశం కల నెరవేరింది. చివరి ప్రపంచకప్‌లో మేం ఛాంపియన్లుగా నిలవడానికి చాలా దగ్గరగా వెళ్లాం. దాని కోసం మా శక్తినంతా ఉపయోగించాం. నా సహచరులంతా చివరి వరకు పోరాడారు. కానీ విజయం దక్కలేదు. అయినప్పటికీ అర్జెంటీనా తరఫున ఆడిన ప్రతి మ్యాచ్ ప్రాణం పెట్టి ఆడాను’ అని మెస్సి వివరించాడు.
మీ వల్లే నా కల నిజమైంది..
అభిమానుల మద్దతు లేకుండా తన కల సాకారం అయ్యేది కాదని మెస్సి అన్నాడు. ‘మీ వల్లే నా కల నిజమైంది. ప్రపంచకప్ సహా ఏ టోర్నీలో ఆడినా మీరు మాకు అండగా నిలిచారు. అర్జెంటీనా తరఫున మైదానంలోకి దిగడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇది నా జీవితంలో, నా కెరీర్‌లో అత్యంత బాధాకరమైన రోజు కావచ్చు. మిమ్మల్ని చాలా మిస్ అవుతా. కానీ ఈ యువ ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటా. మనం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. మనం ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అత్యున్నత లక్ష్యాలను సాధించాలంటే మనం కలిసే ఉండాలి. ఈ జాతీయ జట్టు గెలవడం కొందరికి ఇష్టం లేదు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే మనం మరింత ఐక్యంగా ఉండాలి. ఒక బలమైన సమూహం లేకపోతే ఏదైనా సాధించడం చాలా కష్టం. మా జట్టు ఎప్పుడూ ఒక కుటుంబంలా ఉంది. అందుకే ఇన్ని విజయాలు సాధించగలిగాం.
నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ మైదానాన్ని వదిలి వెళ్లాలని లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతా. నేను ఎప్పటికీ అర్జెంటీనియన్‌గానే ఉంటా. మీ అందరితో కలిసి నా కలను నెరవేర్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది’ అని మెస్సి తన ప్రసంగాన్ని ముగించాడు.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి