Share News

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:19 AM

మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నిష్క్రమణ తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీమిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశాలన్నింటికీ బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హాజరు కానున్నారు.

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
VVS Laxman

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నిష్క్రమణ తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీమిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశాలన్నింటికీ బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (COE) హెడ్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హాజరు కానున్నారు. సెలెక్టర్లు, సీఓఈ మధ్య సమన్వయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు.


‘క్రికెట్ వ్యవహారాల అధిపతిగా, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇకపై అన్ని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరవుతారు. సెలెక్టర్లు, సీఓఈ మధ్య ఎలాంటి అపార్థాలు, కమ్యూనికేషన్‌ లోపాలు లేకుండా చూడటమే ఈ నిర్ణయం ఉద్దేశం. ఆటగాళ్ల పరిస్థితిపై సెలెక్టర్లకు కచ్చితమైన సమాచారం అందితేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరు’ అని దేవజిత్‌ సైకియా వెల్లడించారు.


ఇప్పటివరకు వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేదనే అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, రీఎంట్రీపై సీఓఈ నుంచి స్పష్టమైన సమాచారం సెలెక్టర్లకు చేరడంలో ఆలస్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని బీసీసీఐ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇకపై సెలక్షన్‌ సమావేశాల్లో లక్ష్మణ్‌ కూడా పాల్గొనేలా నిర్ణయించారు. ఇప్పటికే గువాహటిలో జరిగిన టీ20, ఇండియా ‘ఏ’ జట్ల ఎంపిక సమావేశానికి ఆయన హాజరయ్యారు.


అగార్కర్‌ తర్వాత తొలి జట్టు..

అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ప్రకటించిన తొలి భారత జట్టు ఇదే. ప్రస్తుతం ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా సెలక్షన్‌ కమిటీని నడిపిస్తున్నాడు. ఈ జట్టులో వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. మరోవైపు ఆసియా క్రీడలకు గాయం కారణంగా దూరమైన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.


ఇవి కూడా చదవండి:

నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. సెలెక్టర్లు సాహసమే చేశారు: దినేశ్ కార్తీక్

టీ20ల్లో మెయిడెన్ సెంచరీ.. నా కల నిజమైంది: శ్రేయస్ అయ్యర్

Updated Date - Oct 07 , 2026 | 10:20 AM