Share News

మార్పు దిశగా 'మహా' రాజకీయాలు.. బీజేపీ, శివసేనలపై ప్రభావమెంత?

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:42 PM

మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.

మార్పు దిశగా 'మహా' రాజకీయాలు.. బీజేపీ, శివసేనలపై ప్రభావమెంత?
Eknath Shinde Gains Major Boost as 6 UBT MPs

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఓ లేఖను అందజేశారు. ఈ ఫిరాయింపు ఓ లాంఛనమే కాగా.. సంబంధిత ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశముంది. ఫలితంగా లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 13కు పెరుగనుంది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌తో సమానంగా ఉంటుంది. మరోవైపు.. 9 స్థానాలతో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది.


అయితే.. బీజేపీ-షిండేలకు చెందిన మహాయుతి కూటమిలో ఈ పరిణామం నూతన ఒత్తిడులకు దారితీయవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండే మధ్య అభిప్రాయ భేదాలపై ఇప్పటికే చర్చలు సాగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో షిండే వర్గానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశమున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇటీవల 'ఇక ఒకే శివసేన' అని చేసిన వ్యాఖ్య కూడా ఈ రాజకీయ మార్పులకు నేపథ్యంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఈ చేరికలు 2029 ఎన్నికల వ్యూహంలో షిండేకు మరింత బలం చేకూర్చనున్నాయి.


ఆరుగురు ఎంపీల చేరికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణపై కూడా షిండే దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేయడం, సంస్థాగతంగా విస్తరించడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తంగా తాజా పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలను మరోసారి మార్చే అవకాశముంది. బీజేపీ, శివసేన(షిండే వర్గం) మధ్య సంబంధాలు కొత్త దశకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!

Updated Date - Jun 21 , 2026 | 08:42 PM