Share News

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:53 PM

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్‌ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?
Re NEET 2026

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ పరీక్షల చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ప్రశ్నపత్రాల లీక్ వివాదం పునరావృతం కాకుండా నిరోధించడంపై అధికారులు దృష్టి సారించగా.. పలు కేంద్రాలలో చివరి నిమిషంలో వివాదాలు తలెత్తాయి. హిజాబ్‌లు, కలవ దారాలపై వివాదాలు మొదలుకొని, ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం వరకు నేడు కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలుచోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది.


'పరీక్ష కాదు.. బురఖాయే ముఖ్యం'

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది తన బురఖాను తొలగించాలని కోరినట్టు ఓ మహిళా అభ్యర్థి ఆరోపించారు. బేవార్ నుంచి వచ్చిన ఆమె.. మే 3న జరిగిన పరీక్షకు ఈ రకమైన దుస్తుల్లోనే హాజరయ్యానని, ఇప్పుడెందుకు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. 'ఎన్‌టీఏ అనుమతి ఇచ్చినప్పుడు వీళ్లు మమ్మల్ని ఆపలేరు. నేను పరీక్ష రాయాల్సి ఉండి, ఈ దుస్తులలో నన్ను అనుమతించకపోతే అసలు పరీక్షే రాయను. నాకు ఎగ్జామ్ ముఖ్యం కాదు.. బురఖా, గుర్తింపే నాకు ప్రధానం' అని ఆమె అన్నారు.


తల్లిదండ్రుల నిరసన.. రంగంలోకి పోలీసులు

అహ్మదాబాద్‌(గుజరాత్)లోని ఓ పరీక్షా కేంద్రంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారులు, తల్లిదండ్రుల ప్రకారం.. భద్రతా తనిఖీల సమయంలో తొలుత కొందరు ముస్లిం అభ్యర్థులు హిజాబ్‌లు తొలగించగా, కొంతమంది హిందూ విద్యార్థులు పవిత్ర కలవ దారాలను కత్తిరించారు. ఈ చర్య అక్కడ తల్లిదండ్రుల నిరసనలకు దారితీసింది. భద్రతా సిబ్బందిలో కొందరికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో ముస్లిం అభ్యర్థులకు హిజాబ్‌లు, హిందువులకు కలవ దారాలను ఉంచుకోవడానికి అనుమతించారు. అయితే.. అప్పటికే తమ పిల్లల చేతిదారాలను కత్తిరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిబంధనలను యూనిఫామ్‌గా అమలు చేయాలని డిమాండ్ చేశారు.


ఇవీ చదవండి:

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!

Updated Date - Jun 21 , 2026 | 05:30 PM