Share News

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:40 PM

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా
PM Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా నేడు ప్రతిష్ఠాత్మకంగా రీ-నీట్ నిర్వహిస్తోంది ఎన్‌టీఏ. దీని ప్రభావం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణంపై పడింది. మోదీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి తన నివాసానికి బయలుదేరాల్సి ఉండగా.. ఆ ప్రయాణాన్ని 45 నిమిషాల పాటు వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు మోదీ.

అంతకుముందు మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ. ప్రణాళిక ప్రకారం అటు నుంచి వెంటనే తన నివాసానికి బయల్దేరాల్సి ఉంది. కానీ నీట్ పరీక్ష మొదలయ్యే వరకు అక్కడే ఉండి, పరీక్ష ప్రారంభమైన తర్వాతే పయనమయ్యారు.


కాగా.. రీ-నీట్‌ను దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఈ పరీక్ష సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు దాదాపు 2 లక్షలకు పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు. ఆఫ్‌‌లైన్ మోడ్‌లో జరుగుతున్న రీ-నీట్ సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. పలువురు అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా ఇదివరకే నిర్వహించిన నీట్ రద్దైన నేపథ్యంలో.. ఈసారి సరైన సమగ్రత, పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యంతో నిర్వహిస్తున్నట్టు ఎన్‌టీఏ పేర్కొంది.


ఇవీ చదవండి:

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..

బైక్ పార్కింగ్ వివాదం.. కత్తితో దాడి చేసి మహిళ హత్య..

Updated Date - Jun 21 , 2026 | 03:44 PM