బైక్ పార్కింగ్ వివాదం.. కత్తితో దాడి చేసి మహిళ హత్య..
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:11 PM
చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఢిల్లీ: చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. క్షణికావేశంలో ప్రత్యర్థులపై భౌతిక దాడులకూ తెగబడుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పార్కింగ్ వివాదం ఓ మహిళ ప్రాణాలు తీయగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడేలా చేసింది. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపుర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో ఆర్తి, విక్కీ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఓ ద్విచక్రవాహనం ఉండటంతో రోడ్డుపై పార్కింగ్ విషయమై పొరుగింటి వారితో కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న(శనివారం) మధ్యాహ్నం మరోసారి వివాదం చెలరేగింది. చిన్న వివాదం కాస్తా మాటల దాడి నుంచి ముష్టియుద్ధానికి దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన ప్రత్యర్థులు ఆ దంపతులపై కత్తితో దాడికి తెగబడ్డారు. పొట్ట, ఛాతి సహా శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడిచారు. ఇది గమనించిన విక్కీ అత్తమామలు సమాచారాన్ని వెంటనే బిందాపూర్ పోలీసులకు అందించారు.
పోలీసులు వచ్చే లోపే కుమార్తె, అల్లుడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆర్తి మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు తీవ్రంగా గాయపడిన విక్కీని మెరుగైన చికిత్స నిమిత్తం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పప్పు(40), మరో మైనర్‌గా గుర్తించారు. పప్పూను అదుపులోకి తీసుకోగా.. మైనర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ