హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభం..
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:53 AM
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించడం లేదు.
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆస్పత్రి, ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ట్రాఫిక్ నిర్వహణను నగర పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా వన్ వే విధానం అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్‌వే విధానం అమలుపై ప్రజల నుంచి పోలీసులు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 5న ఓసారి వన్ వే ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగా నేడు మరోసారి ట్రయల్ రన్ ప్రారంభించినట్లు తెలిపారు. మొదటిసారి ఎదురైన సమస్యలు, ఇబ్బందులను అధిగమించి రెండోసారి ట్రయల్ ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో లాగే ఈసారీ సహకరించాలని వాహనదారులను కోరారు. ట్రాఫిక్ సూచనలను పాటించి సహకారం అందించాలన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారని, వాహనదారులు వాటిని గమనించాలని సూచించారు.
ట్రయల్ రన్ వల్ల ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని, లాంగ్ జర్నీ అయినప్పటికీ వాహనాలు ఎక్కడా ఆగవని పోలీసులు తెలిపారు. అత్యవసర సేవల వాహనాల రాకపోకల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కేబీఆర్ పార్క్ వద్ద వాకర్స్ రోడ్డు దాటడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వాకింగ్‌కి వచ్చేవారు ఇకపై వాహనాలను రోడ్లపై ఆపడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 150మంది సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో ఉన్నారని, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాల సేవలనూ వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
యోగా జీవితంలో భాగస్వామిగా చేయాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు
యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ