Share News

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:33 AM

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడు యుద్ధ నౌకలను ఆయన జాతికి అంకితం చేశారు.

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కోల్‌కతా, జూన్ 21: ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్‌లను నౌకదళానికి ఆయన అప్పగించారు. ఈ నౌకల ప్రవేశాన్ని వీక్షించే అవకాశం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత నౌకదళంతోపాటు వాటి అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.


ఈ నౌకల నిర్మాణంలో దాదాపు 200 ఎంఎస్ఎంఈ తోడ్పాటును అందించాయని ప్రధాని మోదీ వివరించారు. ఈ ప్రక్రియలో చాలామందికి ఉద్యోగ కల్పన జరిగిందని అన్నారు. ఈ నౌకల నిర్మాణం కోసం రూ. 70,000 కోట్ల వ్యయం అయిందని తెలిపారు. భారత్ ఓడరేవులను ఆధునీకరిస్తూనే సముద్ర పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. మరో వైపు సాగరమాల కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు.


అతి పెద్ద ఎగుమతిదారుగా భారత్..

రక్షణ రంగంలో భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 2014 తర్వాత ఈ రంగంలో ఎగుమతులు రూ. 40 వేల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్లకు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. ఈ మూడు యుద్ధ నౌకలను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (Garden Reach Shipbuilders and Engineers) నిర్మించిందని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్‌ కింద రక్షణ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంభనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సముద్ర రంగాల్లో దాని వ్యూహాత్మక పరిధిని విస్తరించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధాని మోదీ తెలిపారు.


ఐఎన్ఎస్ సంశోధక్ (INS Sanshokhak)..

ఇది అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. సముద్ర శాస్త్ర సమాచారానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఈ నౌక అందిస్తుంది. ఇది సముద్రం అడుగు భాగాన్ని మ్యా్ప్ చేస్తుంది. హైడ్రోగ్రాఫిక్ అంచనాలను నిర్వహిస్తుంది. సురక్షితమైన నావిగేషన్ మార్గాలను ఈ నౌక గుర్తిస్తుంది.


ఐఎన్ఎస్ అగ్రయ్ (INS Agray)..

ఇది తీర ప్రాంతంతోపాటు సముద్ర జలాల్లో సంచరించే శత్రు జలాంతర్గాములను గుర్తిస్తుంది. అలాగే వాటిని నిర్వీర్యం చేయడానికి రూపొందించిన యుద్ధ నౌక. ఇందులో అధునాతన సోనార్ వ్యవస్థ, జలాంతర్గామి వ్యతిరేక రాకెట్లు, టార్పెడోలతోపాటు 30 ఎంఎం నావికా ఫిరంగిలు ఉన్నాయి. ఈ నౌకకు మందుపాతరలు అమర్చే సామర్థ్యం కూడా ఉంది. ఈ నౌక ద్వారా భారత తీర ప్రాంత భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.


ఐఎన్ఎస్ దునగిరి (INS Dunagiri)..

ఇది ప్రాజెక్ట్ 17ఎ కింద ప్రధాన యుద్ధ నౌక. అధునాతన నీలగిరి తరగతి స్టెల్త్ గైడెడ్ క్షిపణి ఫ్రిగేట్‌లలో ఒకటి. బహుళ ప్రయోజన కార్యకలాపాల కోసం దీనిని రూపొందించారు. దీనిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, బరాక్ 8 మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, టార్పెడోలు, ఇతర అధునాతన యుద్ధ సాంకేతికలు అమర్చారు. ఈ నౌక.. వాయు రక్షణ, ఉపరితల యుద్ధం, జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించి గల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

For More National News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 12:14 PM