భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:14 PM
భారత్-ఈయూ దేశాల మధ్య ఎఫ్‌టీఏపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి సంతకాలు పూర్తయ్యే అవకాశమున్నట్టు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య ప్రతిష్ఠాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్(FTA)పై వచ్చే డిసెంబర్ నాటికి సంతకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. అలాగే.. 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశమున్నట్టు ఆయన వెల్లడించారు.
భారత్, 27 ఈయూ దేశాల మధ్య గత జనవరి 27న ఈ కీలక వాణిజ్య ఒప్పందంపై నిర్వహించిన చర్చలు సఫలమైన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యంలోనే ఇదో అత్యంత ప్రభావవంతమైన ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తూ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా పేర్కొంటున్నారు. ఈ విషయమై పీయూశ్ గోయల్ తాజాగా స్పందిస్తూ.. 'ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత ఎగుమతుల్లో సుమారు 93 శాతం ఉత్పత్తులకు యూరోపియన్ మార్కెట్‌లో డ్యూటీ ఫ్రీ ప్రవేశం లభిస్తుంది. దీంతో భారత ఉత్పత్తులు యూరోప్ మార్కెట్లో మరింత పోటీలోకి వస్తాయి' అని అన్నారు.
అదే సమయంలో ఈయూ నుంచి భారత్ దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు, వైన్ వంటి ఉత్పత్తుల ధరలూ తగ్గే అవకాశముందని సమాచారం. దీనివల్ల వినియోగదారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, ఈయూ కలిపి సుమారు 25 శాతం స్థూల దేశీయోత్పత్తి(GDP)ని, అలాగే సుమారు 33 శాతం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కలిగి ఉన్నట్టు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో కీలక పాత్ర పోషించనుంది.
ఇక అంతర్జాతీయ వాణిజ్య చర్చల భాగంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్టు గోయల్ తెలిపారు. పలు వాణిజ్య ఒప్పందాలపై ఆయనతో చర్చలు జరగనున్నాయన్నారు. మరోవైపు.. జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంను ఈ ఏడాదే పూర్తిచేయాలని ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా భారత్-ఈయూ డీల్ అమల్లోకి వస్తే భారత ఎగుమతులకు భారీ అవకాశాలు ఏర్పడటం సహా గ్లోబల్ ట్రేడ్‌లో భారత్ మరింత పటిష్ఠ స్థితికి చేరనుంది.
ఇవీ చదవండి:
ఉక్రెయిన్ డ్రోన్ పవర్.. రష్యాలో 2,000 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి..
ఒప్పందం కుదరకపోతే.. హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: ట్రంప్