Share News

'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం

ABN , Publish Date - Jun 20 , 2026 | 10:34 AM

ఘర్షణల సమయంలో లైంగిక హింస నిర్మూలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఐక్యరాజ్యసమితి కార్యక్రమం కాస్తా ఓ దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ వేదిక అనే విషయం మరచిన యూఎన్ ఉన్నతాధికారి, ఇజ్రాయెల్ రాయబారి ఒకరిపై మరొకరు నోరుపారేసుకున్నారు.

'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం
Israeli envoy's fiery spat with UN official at New York meet

ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి(యూఎన్) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్, ఐరాస ఉన్నతాధికారి వెనెస్సా ఫ్రేజియర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణల సమయంలో లైంగిక హింస నిర్మూలనపై జరిగిన బహిరంగ చర్చలో ఈ వివాదం రాజుకుంది.


సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై లైంగిక హింస ఆరోపణలకు సంబంధించిన నివేదికను రూపొందించిన యూఎన్ ప్రతినిధి ప్రమీలా పాటెన్ రాజీనామా చేయాలని డానన్ డిమాండ్ చేశారు. ఆ నివేదిక పక్షపాత ధోరణితో రూపొందించారని, ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దీంతో యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తరఫున పిల్లలు, సాయుధ ఘర్షణల అంశాలను పర్యవేక్షిస్తున్న వెనెస్సా ఫ్రేజియర్ కల్పించుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని డానన్‌ను హెచ్చరించిన ఆమె.. నివేదికలో పొందుపరిచిన అంశాలకు తగిన ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఆగ్రహించిన డాన్.. 'ఐరాసలో మాదో సభ్య దేశం. మీరు ఒక ఉద్యోగి. మీరెప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరూ.. మీ నివేదిక...' అని ఘాటుగా ఆమెపై నోరుపారేసుకున్నారు. అనంతరం ఫ్రేజియర్ రూపొందించిన నివేదికనూ తీవ్రంగా విమర్శించారాయన.


ఇటీవల విడుదలైన నివేదికలో పాలస్తీనా పిల్లలపై జరుగుతున్న ఉల్లంఘనలపై యూఎన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్‌ను 'లిస్ట్ ఆఫ్ షేమ్'లో చేర్చింది. అవసరమైతే ఆ దేశానికి చెందిన సెటిలర్ గ్రూపులనూ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చని హెచ్చరించింది. మరోవైపు.. హమాస్ సంస్థ కూడా యూఎన్ బ్లాక్‌లిస్ట్‌లో కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఇజ్రాయెల్-యూఎన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.


ఇవీ చదవండి:

‘నేనే బాస్’ కామెంట్‌పై క్లారిటీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి

Updated Date - Jun 20 , 2026 | 11:07 AM