యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి
ABN , Publish Date - Jun 20 , 2026 | 08:35 AM
యూకేలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో రెండు రైళ్లు ఢీకొనడంతో ఒక లోకోపైలట్ మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: యూకేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో ఒక లోకోపైలట్ మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్యాసింజర్లు గాయపడ్డారు. బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలోని (ఇంగ్లండ్) బెడ్‌ఫోర్డ్ టౌన్‌కు సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
సెయింట్ పాంక్రాస్ స్టేషన్‌కు వెళుతున్న రెండు ఈస్ట్ మిడ్‌లాండ్స్ రైల్వే సర్వీసు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రాక్‌పై నిలిచి ఉన్న రైలును అదే ట్రాక్‌పై వస్తున్న మరో రైలు వెనక నుంచి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 89 మంది ప్యాసింజర్లు గాయపడగా వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, అసలు ఏం జరిగిందనేదానిపై యూకే ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇది భారీ ప్రమాదమని బ్రిటిష్ ట్రాన్స్‌పోర్టు పోలీసులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ప్రమాదం నేపథ్యంలో సెయింట్ పాంక్రాస్ స్టేషన్‌కు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
ప్రమాదం తరువాత బోగీల్లో భయానక వాతావరణం కనిపించిందని ఒక ప్యాసింజర్ తెలిపారు. ‘నేను లేచి చూసే సరికి, సీట్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఏదో బాంబు దాడి జరిగినట్టు అనిపించింది. దట్టమైన పొగ కమ్ముకుంది. తోటి ప్యాసింజర్లు అనేక మంది గాయాలపాలయ్యారు. ముఖాలు రక్తంతో తడిసిపోయాయి. కొందరి కాళ్లు విరిగిపోయాయి’ అని డా. పీటర్ నాప్ స్థానిక మీడియాకు తెలిపారు. అకస్మాత్తుగా భారీ శబ్దం వినిపించిందని, ప్రయాణికులందరూ తమ సీట్లల్లోంచి ఎగిరిపడ్డారని మరో ప్యాసింజర్ తెలిపారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సందిగ్ధంలో యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం
మెలోని నాతో ఫొటో కోసంఅడుక్కున్నారు : ట్రంప్