Share News

సందిగ్ధంలో శాంతి ఒప్పందం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:06 AM

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం మళ్లీ సందిగ్ధంలో పడింది. రెండు దేశాల ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

సందిగ్ధంలో శాంతి ఒప్పందం

  • స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరగాల్సిన చర్చలు వాయిదా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులే కారణం?

వాషింగ్టన్‌, జూన్‌ 19: అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం మళ్లీ సందిగ్ధంలో పడింది. రెండు దేశాల ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. గురువారం రాత్రి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 18 మంది మరణించారు. దీంతో చర్చలపై ఇరాన్‌ వెనక్కి తగ్గినట్లు తెలిసింది. సమావేశం వాయిదా పడిన విషయాన్ని అమెరికా, ఇరాన్‌తోపాటు స్విట్జర్లాండ్‌ కూడా ధ్రువీకరించింది. తన ఇజ్రాయెల్‌ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు. చర్చలకు ఏర్పాట్లు చేయటం ఊహించినంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చర్చలపై ఏవైనా నిర్మాణాత్మక నిర్ణయాలు ఉంటే త్వరలో మీడియాకు వెల్లడిస్తామని తెలిపింది. బుర్గెన్‌స్టాక్‌ రిసార్ట్‌లో శుక్రవారం జరగాల్సిన చర్చలు, శాంతి ఒప్పంద కార్యక్రమం వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్‌ ప్రకటించింది. అందుకు గల కారణాలను మాత్రం తెలపలేదు. చర్చల వాయిదాపై ఇరాన్‌ నాయకత్వం నేరుగా స్పందించలేదు. అయితే, ఎంవోయూను అమెరికా అమలుచేసి విశ్వాసం కలిగిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్‌ మీడియా సంస్థ టాస్నిమ్‌ న్యూస్‌ స్పష్టంచేసింది. తమ ప్రతినిధులు ఎవరూ స్విట్జర్లాండ్‌ వెల్లడం లేదని పేర్కొంది. అపనమ్మకం ఉన్నచోట శాంతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది. 60 రోజులపాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ అధ్యక్షులు ట్రంప్‌, మసౌద్‌ పెజెష్కియాన్‌ బుధవారం వర్చువల్‌గా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై రెండు దేశాల ప్రతినిధులు ముఖాముఖి సమావేశం అయ్యేందుకు స్విట్జర్లాండ్‌లో ఏర్పాట్లు చేశారు.


లెబనాన్‌ మొత్తం తగలబడాల్సిందే

ఇరాన్‌-అమెరికా శాంతి ఒప్పందంతో తమకు సంబంధం లేదని ప్రకటించిన ఇజ్రాయెల్‌.. గురువారం రాత్రి దక్షిణ లెబనాన్‌పై విచ్చలవిడిగా దాడులు చేసింది. హెజ్బొల్లా ఉగ్రవాదులు మొదట దాడిచేసినందునే తాము వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. తమ సైనికులు కూడా నలుగురు మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. కాగా, ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా శాఖ మంత్రి బెన్‌ గ్విర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌ మొత్తం తగలబడాల్సిందే. ఇజ్రాయెల్‌ తల్లుల ప్రతి కన్నీటి బొట్టుకు వెయ్యిమంది లెబనాన్‌ తల్లులు కన్నీరు కార్చాల్సిందే. మా బిడ్డలు చిందించిన రక్తానికి బదులు తీర్చుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా శుక్రవారం అంగీకరించాయి. అమెరికా, ఖతార్‌, ఇరాన్‌ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు.

ఇరాన్‌ పని అయిపోయింది: ట్రంప్‌

తాము చేపట్టిన సైనిక చర్యతో ఇరాన్‌ పూర్తిగా బలహీనపడిందని ట్రంప్‌ అన్నారు. ఈ అంశంపై శుక్రవారం ఆయన ట్రూత్‌ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు. ‘యుద్ధంతో ఇరాన్‌ పని అయిపోయింది. ఇప్పుడు ఆ దేశానికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు. రాడార్లు, విమాన విధ్వంసక వ్యవస్థల వంటివి ఏమీ లేవు. కానీ, మా రాజకీయ ప్రత్యర్థులు మాత్రం 4నెలల క్రితం కంటే ఇప్పుడే ఇరాన్‌ శక్తిమంతంగా ఉందని అంటున్నారు. ఎంతటి మూర్ఖులు!’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 05:37 AM