లోక్‌సభలో కొనసాగిన విపక్షాల ఆందోళన.. రెండు బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:51 PM
లోక్‌సభలో వరుసగా 12వ రోజూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే.. ఆందోళనల మధ్యే కేంద్రం రెండు బిల్లులను ఆమోదించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీ అంశం, రామాలయ విరాళాల చోరీ ఘటనలు లోక్‌సభను ఇవాళ కూడా స్తంభింపజేశాయి. సభ సజావుగా సాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యులను కోరగా.. వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే.. ఈ ఆందోళనల నడుమే కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. ట్యాక్సేషన్ ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రప్రియేషన్ బిల్లు-2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో వెంటనే సభలో చర్చకు రాగా.. విపక్ష సభ్యులు ఇరు బిల్లులనూ వ్యతిరేకిస్తూ గందరగోళం సృష్టించారు. కానీ.. చివరకు మూజువాణి ఓటుతో రెండు బిల్లులూ ఆమోదం పొందాయి. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
కాగా.. నేటితో పార్లమెంట్ సమావేశాలు 12వ రోజుకు చేరుకోగా.. సభ ప్రారంభంలోనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను తొలుత మధ్యాహ్నం 12:00 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మరోసారి 2:00 గంటలకు వాయిదా పడింది. అయితే.. ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రశ్నోత్తరాల సమయం జరగకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
రాజీనామా చేస్తానంటే.. వెంటనే ఓకే చేస్తా.. అసంతృప్తులపై కర్ణాటక సీఎం వ్యాఖ్య
మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు