Share News

బీజేపీ ఇప్పుడు ఓటు చోరీ కాదు.. సీటు చోరీ చేస్తోంది: కేసీ వేణుగోపాల్

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:31 PM

దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.

బీజేపీ ఇప్పుడు ఓటు చోరీ కాదు.. సీటు చోరీ చేస్తోంది: కేసీ వేణుగోపాల్
KC Venugopal

ఢిల్లీ, జూన్11, (ఆంధ్రజ్యోతి): దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. మోదీ సర్కార్‌లో ప్రజలు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయిని ఆరోపించారు. ఈరోజు (గురువారం) ఢిల్లీ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మీడియాతో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.


మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ..

దేశవ్యాప్త ఆందోళనలు, ప్రచారాలకు సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని విమర్శించారు. కోర్టు నోటీసు ఆధారంగా చేసుకుని ఎఫ్ఐఆర్ లేకపోయినా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగా నింపకపోయినా ఆ నామినేషన్ అంగీకరించారని ఆగ్రహించారు. లోపాలున్నా బీజేపీ అభ్యర్థి నామినేషన్ స్వీకరించి.. ఎఫ్ఐఆర్ నమోదు కానీ కేసును సాకుగా చూపిస్తూ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని మండిపడ్డారు.


ఆ నామినేషన్ తిరస్కరణపై పోరాడతాం..

దేశంలో ప్రజాస్వామ్యం దయనీయ పరిస్థితుల్లో ఉందని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కార్యాలయం లోపలికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని అన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలను బీజేపీ ఎంపీలుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ఇప్పుడు సీటు చోరీకి పాల్పడుతోందని ఆక్షేపించారు. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్థిక సంక్షోభం అంశాలపై మాట్లాడామని తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు.


దేశ యువత భవిష్యత్తు ఆందోళనలో ఉంది..

దేశ యువత భవిష్యత్తు ఆందోళనలో ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. పేపర్ లీకుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ప్రభావితం అయ్యారని చెప్పారు. నీట్ పరీక్ష లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత కూడా వహించడం లేదని ఆగ్రహించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ అంశాలు దేశంలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలని ప్రస్తావించారు. రానున్న రెండు, మూడు నెలల్లో విద్యావ్యవస్థ లోపాలపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పచ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోందని... కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఆందోళనల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.


అందుకే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ: ఎంపీ జైరాం రమేశ్

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విమర్శించారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కూర్చుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 04:48 PM