మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:33 AM
మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: కావేరి నదిపై వివాదాస్పదమైన మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది కీలకమని కన్నడిగులు వాదిస్తున్నారు. మరోవైపు.. దీనివల్ల తమకు నీటి కొరత ఏర్పడుతుందంటూ తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం పదవి చేపట్టాక ఢిల్లీలో ప్రధానిని కలిసిన డీకే.. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేకెత్తిస్తున్న మేకెదాటు ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని మోదీని కోరారు. సుప్రీం కోర్టులో తమిళనాడు దాఖలు చేసిన రివ్యూ, ఇతర అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసిందని ప్రస్తావిస్తూ.. కేంద్రం వెంటనే తగు క్లియరెన్స్ ఇవ్వాలని లేఖలో విన్నవించారు. ఈ ప్రాజెక్ట్ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(CWMA), కేంద్ర జల సంఘం(CWC)లకే ఉందని ఆయన స్పష్టం చేశారు. సవరించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సమర్పించేందుకు కర్ణాటక సిద్ధమవుతోందని కూడా శివకుమార్ పేర్కొన్నారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(MoEFCC) వద్ద పెండింగ్ పనులను పరిష్కరించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యమూ అవసరమని ఆయన కోరారు.
కాగా.. రామనగర జిల్లాలో(దక్షిణ బెంగళూరు) ప్రతిపాదించిన ఈ జలాశయాన్ని బెంగళూరుకు తాగునీటిని అందించడం సహా 400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా చేపట్టారు. ఈ క్రమంలో కావేరీ నీటిలో తమిళనాడుకు కేటాయించిన వాటాకు ఎలాంటి ఆటంకం కలగదని కర్ణాటక హామీ ఇచ్చింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ కావేరి జల వివాద ట్రైబ్యునల్ తుది తీర్పునకు విరుద్ధమని తమిళనాడు వాదిస్తోంది. దీనివల్ల కావేరి డెల్టా ప్రాంతంలోని రైతులు నష్టపోతారని, కర్ణాటక ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అక్కడి రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై గత నెలలో ఆ రాష్ట్ర సీఎం విజయ్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్‌పై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం కన్నడిగుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..
కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో..