ఏదో తేడాగా ఉంది.. భారత జీడీపీ గణాంకాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్
ABN , Publish Date - Jun 12 , 2026 | 08:20 AM
భారత్‌లో కార్పొరేట్ రంగ పెట్టుబడులు, విదేశీ నిధుల రాకడ మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ తీరుకు, అధికారిక జీడీపీ గణాంకాలకు మధ్య పొంతన కుదరట్లేదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో కార్పొరేట్ రంగ పెట్టుబడులు, విదేశీ నిధుల రాకడ తక్కువగా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ తీరుకు, అధికారిక గణాంకాల్లో కనిపిస్తున్న అధిక జీడీపీ వృద్ధి రేటుకు మధ్య పొంతన కుదరట్లేదని అన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పైగానే ఉందని ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.
ఈ అంశాలపై జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఏదో తేడా కనిపిస్తోందని అన్నారు. వృద్ధిరేటు, పెట్టుబడుల రాక మధ్య పొంతన లేనట్టు అనిపిస్తోందని అన్నారు. ‘నాకు అర్థం కావట్లేదు. ఆర్థిక వ్యవస్థ ఇంతటి రేటుతో పెరుగుతుంటే పెట్టుబడులు అదే స్థాయిలో ఉండాలి. కానీ అలా కనిపించట్లేదు. ఏదో తేడాగా ఉంది’ అని అన్నారు.
కార్పొరేట్ పెట్టుబుడులు ఆశించిన మేర పెరగకపోవడం భారత ఆర్థిక వ్యవస్థలో ఒక పజిల్ అని ఆయన వ్యాఖ్యానించారు. గత దశాబ్దకాలంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ‘కార్పొరేట్ పెట్టుబడులు ఎందుకు పెరగట్లేదనేది పదేళ్ల క్రితం ఒక పజిల్‌గా ఉండేది. ఇప్పటికే అదే పరిస్థితి ఉంది. బహుశా గణాంకాల్లో కనిపిస్తున్న దానికంటే ఆర్థికాభివృద్ధి కాస్త మందకొడిగా ఉందేమో’ అని అన్నారు.
‘పెట్టుబడులు పెరగట్లేదంటే దేశంలో డిమాండ్ ఆశించిన మేర లేదని వాళ్లు భావిస్తున్నారేమో. జీడీపీ గణాంకాల స్థాయిలో డిమాండ్ లేదేమో. అంటే, ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రతిబింబించట్లేదని భావించాలి. భారత్‌లోకి ఎఫ్‌డీఐల రాకడ తగ్గింది. ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మించేందుకు వారు నిధులు తీసుకురావట్లేదు. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ నుంచి తరలిపోతున్నారు. వారికి ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గిందనేందుకు అనుగుణంగా ఈ పరిణామాలు ఉన్నాయి ’ అని రఘురామ్ రాజన్ అన్నారు.
ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు భారత్ దిగుమతులపై అధికంగా ఆధారపడుతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ అన్నారు. ఫలితంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత సుదీర్ఘకాలం పాటు కొనసాగితే భారత్‌పై ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. ఇక ఇంధన ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకూ పరిమితి ఉంటుందని అన్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఖజానాపై భారం పడుతుందని, అప్పుల భారం పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాల నుంచి నిధులను ఇతర అవసరాలకు మళ్లించాల్సి రావొచ్చని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
60 నుంచి 90 రోజులకు.. ఇంధన సామర్థ్యం పెంచే యోచనలో కేంద్రం