సాహిల్ సూసైడ్ కేసు.. ప్రొఫెసర్ సూర్యనారాయణకు మద్దతుగా ఐఐటీ మద్రాస్
ABN , Publish Date - Sep 22 , 2026 | 07:51 AM
సాహిల్ ఆత్మహత్య కేసులో వేటుకు గురైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు ఐఐటీ మద్రాస్ మద్దతుగా నిలిచింది. అలాగే సాహిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసులో వేటుకు గురైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు విద్యాసంస్థలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) కూడా ఆ ప్రొఫెసర్‌కు మద్దతు తెలిపింది. తాము ప్రొ. సూర్యనారాయణకు మద్దతుగా నిలుస్తున్నామని ఐఐటీ మద్రాస్ సిబ్బంది వెల్లడించారు. అలాగే సాహిల్ కుటుంబం సభ్యులు, స్నేహితుల పక్షాన కూడా తాము నిలబడతామని పేర్కొన్నారు.
సాహిల్ కుటుంబానికి, స్నేహితులకు జరిగిన నష్టాన్ని ఏదీ తీర్చలేదంటూ ఐఐటీ మద్రాస్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఒక విద్యార్థి మరణం కూడా విద్యాసంస్థలో తీరని లోటుగా మారుతుందని వివరించింది. ఇదే సమయంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు మద్దతు ప్రకటించింది. విద్యాసంస్థ ఆమోదించిన సూచనలకు అనుగుణంగానే ఆయన వ్యవహరించారని ఐఐటీ బాంబే చేసిన వ్యాఖ్యలను ఐఐటీ మద్రాస్ పునరుద్ఘాటించింది.
ఇలాంటి సందర్భంలో విచారణ సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. అయితే దర్యాప్తు ప్రక్రియ పూర్తి కాకుండానే ఒకరిని బాధ్యులుగా చేయడం సరికాదని చెప్పింది. సోషల్ మీడియాలోని ఊహాగానాలను పరిగణనలోకి తీసుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని వివరించింది. ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు ఐఐటీ బాంబే కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
సాహిల్ ఆత్మహత్య
ఈ నెల 18వ తేదీన (శుక్రవారం) ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఆ విద్యాసంస్థ స్పందిస్తూ పరీక్ష సమయంలో సదరు విద్యార్థి ఫోన్ వినియోగించారని, ప్రశ్నల సమాధానాల కోసం చాట్‌జీపీటీ ఉపయోగించారని తెలిపింది. దీనిపై పరీక్ష పర్యవేక్షకుడు ప్రొఫెసర్ సూర్యనారాయణ మాట్లాడితే మనస్తాపంతో సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యలను సాహిల్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కుల వివక్ష, వేధింపుల కారణంగా సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఉదంతంలో ప్రొ.సూర్యనారాయణ వేటుకు గురయ్యారు.
ఇవీ చదవండి
డీన్ సూర్యనారాయణపై ఐఐటీ బాంబే వేటు
కర్ణాటక శాసనసభలో వందేమాతరం వివాదం