రెండ్రోజుల్లో ఫైళ్లను క్లియర్ చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:45 AM
ఆరోగ్య శాఖలో ఫైళ్లు ఏ స్థాయిలోనూ రెండు రోజులకు మించి ఆగకూడదని మంత్రి సత్యకుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ఏ విషయంపై అయినా 15 రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా మార్పు తేవాలని నిర్దేశించారు.
ఏ స్థాయిలోనూ అంతకుముందు మించి ఆగొద్దు
అధికారులకు ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలో ఫైళ్లు ఏ స్థాయిలోనూ రెండు రోజులకు మించి ఆగకూడదని మంత్రి సత్యకుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ఏ విషయంపై అయినా 15 రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా మార్పు తేవాలని నిర్దేశించారు. ఆలస్యానికి కారణమయ్యే వారి నుంచి వివరణ తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖలో ఫైళ్ల క్లియరెన్స్, వైద్య సిబ్బంది హాజరుపై సోమవారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రిత్వ శాఖ కార్యాలయం దృష్టికి వచ్చిన 4420 అంశాలను పరిశీలన, పరిష్కారం కోసం శాఖలోని వివిధ విభాగాలకు పంపించామన్నారు. ఇందులో ఎక్కువ బదిలీలకు సంబంధించివని ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటి వరకూ 40 శాతం ఫైళ్లను మాత్రమే పరిష్కరించినట్లు అధికారులు చెప్పడంతో.. ఇందుకు కారణాలపై మంత్రి ఆరా తీసారు. సిబ్బంది కొరత కారణంగా ఫైళ్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని అధికారులు తెలియజేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.