Share News

డీన్‌ సూర్యనారాయణపై ఐఐటీ బాంబే వేటు

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:38 AM

బీటెక్‌ విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్య ఉదంతం ఎన్నో కీలక మలుపులు తిరుగుతోంది. ఈ విషయమై ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్‌ అఫైర్స్‌ డీన్‌ పదవి నుంచి సూర్యనారాయణ దూళ్లను తొలగించింది

డీన్‌ సూర్యనారాయణపై   ఐఐటీ బాంబే వేటు
suryanarayana

  • విద్యార్థి సాహిల్‌ ఆత్మహత్య నేపథ్యంలో నిర్ణయం

  • డీన్‌ సస్పెన్షన్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు

  • ప్రొఫెసర్‌గానూ తొలగించాలని డిమాండ్‌

  • సమగ్ర విచారణ కోరుతూ నిరసనలు

  • ఎఫ్‌ఐఆర్‌లో సూర్యనారాయణ పేరు

  • డీన్‌కు ఐఐటీ బాంబే, మద్రాస్‌ ఫ్యాకల్టీల మద్దతు

ముంబై, సెప్టెంబరు 21: బీటెక్‌ విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్య ఉదంతం ఎన్నో కీలక మలుపులు తిరుగుతోంది. ఈ విషయమై ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్‌ అఫైర్స్‌ డీన్‌ పదవి నుంచి సూర్యనారాయణ దూళ్లను తొలగించింది. ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్‌ వాకోడే(22) శుక్రవారం సాయంత్రం క్యాంప్‌సలోని తనహాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. అదే రోజు మధ్యాహ్నం మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలో సాహిల్‌ చాట్‌జీపీటీ సాయంతో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. ఇన్విజిలేటర్‌ విధుల్లో ఉన్న సూర్యనారాయణ పట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రొఫెసర్‌ సూర్యనారాయణ కుల వివక్ష చూపడం, మానసికంగా వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అందులో ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూళ్ల పేరును చేర్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపారు. మరోవైపు సాహిల్‌ మరణానికి ముందు అంశాలపై తమ ప్రకటన పట్ల ఐఐటీ బాంబే విచారం వ్యక్తం చేసింది. సాహిల్‌ పరీక్షా సమయంలో ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీలోకి అప్‌లోడ్‌ చేసి, సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని సంస్థ శనివారంనాటి ప్రకటనలో పేర్కొంది. విచారణ పూర్తికాకుండానే సాహిల్‌ తప్పు ఉందని తేల్చడం పట్ల విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఐఐటీ బాంబే క్షమాపణలు చెబుతూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.


మరోవైపు సాహిల్‌ మృతికి కారణాలపై సమగ్ర విచారణ కోసం ఐఐటీ బాంబే విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సాహిల్‌ తీవ్రమైన ఒత్తిడిని, అకెడమిక్‌ సస్పెన్షన్‌ బెదిరింపులను ఎదుర్కొన్నాడని ఆరోపించారు. సూర్యనారాయణను డీన్‌ పదవి నుంచే కాకుండా ప్రొఫెసర్‌గానూ తొలగించాలని నిరసనలకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఐఐటీ బాంబే ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశంలో డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే రాజీనామా చేయలేదని ఐఐటీ బాంబే స్పష్టం చేసింది. క్యాంప్‌సలో కుల వివక్షను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడలేదని, విద్యాపరమైన ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉందని ఓ విద్యార్థి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే, సాహిల్‌ ఆత్మహత్యను కులం కోణంలో చూడడం సరికాదని మహారాష్ట్ర మంత్రి యోగేష్‌ కదమ్‌ అన్నారు. సీబీఐ విచారణ డిమాండ్‌పై సీఎం ఫడ్నవిస్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

నాగార్జున వర్సిటీ పూర్వ విద్యార్థి

ఈ వ్యవహారంలో ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు తోటి బోధనా సిబ్బంది మద్దతుగా నిలిచారు. ఐఐటీ బాంబే ఫాకల్టీ సభ్యులు సోమవారం ఉదయం క్యాంప్‌సలో మార్చ్‌ నిర్వహించారు. సూర్యనారాయణ లోగడ విద్యార్థుల వ్యవహారాల డీన్‌గా.. విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారని ఫ్యాకల్టీ ఫోరమ్‌ ఆఫ్‌ ఐఐటీ బాంబే తెలిపింది. అవాస్తవ, తప్పుదోవ పట్టించే కథనాలతో సహోద్యోగి ప్రతిష్ఠను దెబ్బతీస్తుండడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొంది. ఇన్విజిలేటర్‌గా ఆయన నిబంధనల మేరకే నడుచుకున్నారని స్పష్టం చేసింది. మరోవైపు ఐఐటీ మద్రాస్‌ ఫ్యాకల్టీ అసోసియేషన్‌ సైతం సూర్యనారాయణకు మద్దతు ప్రకటించింది. విద్యార్థి మరణం మొత్తం విద్యార్థి లోకానికి తీరని లోటని పేర్కొంది. ప్రొఫెసర్‌ దూళ్ల సూర్యనారాయణ నాగార్జున వర్సిటీ పూర్వ విద్యార్థి. బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను నాగార్జున వర్సిటీలో 2000లో పూర్తి చేసిన ఆయన, 2002లో ఐఐటీ బాంబేలో ఎనర్జీ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ పట్టా అందుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు

'బోన్‌ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి

Updated Date - Sep 22 , 2026 | 02:38 AM