Share News

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 07:46 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వార్తా సంస్థలు సీఈఎన్‌ఎన్‌, పొలిటికో, ఎంఎస్‌ నౌ మధ్య వివాదం మరింత ముదిరింది. వైట్‌హౌస్‌లోకి తమ ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ మూడు మీడియా సంస్థలు ట్రంప్‌ ప్రభుత్వంపై న్యాయపోరాటం ప్రారంభించాయి.

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వార్తా సంస్థలు సీఈఎన్‌ఎన్‌, పొలిటికో, ఎంఎస్‌ నౌ మధ్య వివాదం మరింత ముదిరింది. వైట్‌హౌస్‌లోకి తమ ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ మూడు మీడియా సంస్థలు ట్రంప్‌ ప్రభుత్వంపై న్యాయపోరాటం ప్రారంభించాయి. దీనిపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ పోస్టులో సీఈఎన్‌ఎన్‌, పొలిటికో, ఎంఎస్‌ నౌపై విమర్శలు చేశారు (White House access lawsuit).


సదరు మీడియా సంస్థలు తనను, తన ప్రభుత్వాన్ని ప్రతికూలంగా చూపించే తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. వైట్‌హౌస్‌, ఓవల్‌ కార్యాలయంలోకి ఇలాంటి సంస్థలకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సీఈఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలు సోమవారం వాషింగ్టన్‌లోని సమాఖ్య న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాయి. తమ పాత్రికేయుల అనుమతి పత్రాలను రద్దు చేయడం, వైట్‌హౌస్‌ ప్రాంగణంలోకి ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగంలోని తొలి సవరణలోని పత్రికా స్వేచ్ఛ హక్కులకు విరుద్ధమని అవి వాదించాయి (Trump media fight).


మీడియా సంస్థల న్యాయపోరాటంపై ట్రంప్ స్పందించారు (US press freedom). తాను పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తానని, అయితే తప్పుడు వార్తలను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. వైట్‌హౌస్‌ ప్రవేశం పొందే మీడియా సంస్థలు న్యాయంగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అవి కేన్సర్‌లా సమాజాన్ని పీడిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తిమోతి కెల్లీ గతంలో తన నియామకంతోనే పదవిలోకి వచ్చారని ట్రంప్‌ పేర్కొనడం విశేషం.


ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 22 , 2026 | 07:49 AM