న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:44 PM
గాయం బారిన పడిన భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కోలుకున్నాడు. ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ మధ్య మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: గాయం బారిన పడిన భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కోలుకున్నాడు. ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ మధ్య మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించి న్యూజిలాండ్ పర్యటనకు భారత టెస్టు జట్టులో రిజర్వ్ ఓపెనర్ స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తున్నాడు.
సాయ్ సుదర్శన్ ఇప్పటివరకు భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్- ఎ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో వరుసగా 132, 168 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత కాలికి ఫ్రాక్చర్ కావడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సుమారు ఆరు వారాల పాటు పునరావాసం తీసుకుని తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
రిజర్వ్ ఓపెనర్ స్థానం కోసం..
భారత్ టెస్టు జట్టులో రిజర్వ్ ఓపెనర్ స్థానం కోసం సుదర్శన్‌తో పాటు అమన్ మొఖాడే కూడా పోటీ పడుతున్నాడు. మరోవైపు భారత్-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దేవదత్ పడిక్కల్ శ్రీలంకలో జరిగిన గత సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి టెస్టు జట్టులో మూడో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. దీంతో సుదర్శన్ మరోసారి ఓపెనింగ్ స్థానంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. భారత టెస్టు జట్టులో వన్ డౌన్ బ్యాటర్, రిజర్వ్ స్పిన్నర్ స్థానాలపై సెలెక్టర్లు దృష్టి సారించారు. జనవరి చివరి వారం నుంచి మార్చి తొలి వారం వరకు జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఈ స్థానాలకు ప్రాధాన్యం పెరిగింది.
రెండు లక్ష్యాలతో సిరీస్..
ఆస్ట్రేలియా-ఎ పర్యటనకు భారత్ రెండు ప్రధాన లక్ష్యాలతో సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు ఉండటంతో.. ఆటగాళ్లకు గాయాలు లేదా ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తినప్పుడు వారి స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లను గుర్తించడం ఒక లక్ష్యం. అదే సమయంలో న్యూజిలాండ్‌లో జరగనున్న మూడు టెస్టుల పర్యటనకు ఎంపిక చేసేందుకు ఆటగాళ్లను కూడా సెలెక్టర్లు పరిశీలించనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్
ఆసియా క్రీడలు: సెమీస్ డ్రా.. సుచిక ఫైనల్‌కు వెళ్లకపోవడం వెనుక వింత రూల్!