వలరివన్ వండర్
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:49 AM
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తొలిరోజే పతకాల వేట ఆరంభించారు. ఆదివారం పోటీల్లో షూటింగ్‌లో ఎలవెనిల్ వలరివన్ అద్భుత ప్రదర్శనతో రెండు రజతాలు లభించాయి...
10మీ. ఎయిర్‌రైఫిల్ వ్యక్తిగత,
టీమ్ ఈవెంట్స్‌లో అద్భుత ప్రదర్శన
క్రికెట్, మార్షల్ ఆర్ట్స్‌లో పతకాలు ఖాయం
షూటింగ్‌లో రెండు రజతాలు
ఆసియా క్రీడలు
నగోయా: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తొలిరోజే పతకాల వేట ఆరంభించారు. ఆదివారం పోటీల్లో షూటింగ్‌లో ఎలవెనిల్ వలరివన్ అద్భుత ప్రదర్శనతో రెండు రజతాలు లభించాయి. మరోవైపు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచికా తరియాల్ సెమీస్ చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకోగా.. మహిళల క్రికెట్ సెమీ్‌సలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా హర్మన్‌ప్రీత్ సేన స్వర్ణంపై కన్నేసింది. ఇక మహిళల, పురుషుల హాకీ జట్లు తమ ఆరంభ మ్యాచ్‌ల్లో ఘనంగా బోణీ చేయగా.. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్స్‌లోనూ శుభారంభం దక్కింది. అయితే ఉషు, టెక్‌బాల్ ఈవెంట్లలో మాత్రం నిరాశే ఎదురైంది.

ఎలవెనిల్ అదుర్స్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల షూటర్ ఎలవెనిల్ వలరివన్ సత్తా చాటింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన వ్యక్తిగత విభాగంలో ఆమె తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. ఆరంభం నుంచే కచ్చితమైన షాట్లతో చైనా, కొరియన్ షూటర్లను వణికించింది. ఇలా 21 షాట్ల వరకు కూడా ఎలవెనిల్ టాప్‌లో నిలిచినా, ఆఖర్లో జపాన్ షూటర్ హినాటా తైచీ ముందుకెళ్లింది. చివరకు తైచీ ఓవరాల్‌గా 253 పాయింట్లతో ఆసియా గేమ్స్ రికార్డు నెలకొల్పి స్వర్ణం దక్కించుకుంది. ఇక, తైచీకన్నా 0.6 పాయింట్లు మాత్రమే వెనుకంజలో నిలిచిన ఎలవెనిల్ మొత్తంగా 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతానికి పరిమితమైంది. దక్షిణ కొరియా షూటర్ బాన్ హ్యోజీన్ ((230.4)కు కాంస్యం లభించింది. అంతకుముందు జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజతం నెగ్గడంలోనూ ఎలవెనిల్ కీలకపాత్ర పోషించింది. టీమ్ ఈవెంట్ ఫైనల్స్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం 1898.0 పాయింట్లతో ద్వితీయ స్థానం దక్కించుకొని భారత్ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చింది. చైనా బృందం (1904.2) స్వర్ణం, ఆతిథ్య జపాన్ (1897.1) కాంస్యం చేజిక్కించుకున్నాయి. ఇక ఒకే టోర్నీలో రెండు పతకాలతో భారత అమ్మాయి ఎలవెనిల్ డబుల్ ధమాకా సృష్టించింది.
హాకీలో బోణీ: భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాయి. మహిళల విభాగంలో ఉబ్బెకిస్థాన్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 19-0తో గెలిచింది. దీపిక ఏకంగా 8 గోల్స్‌తో చెలరేగడం విశేషం. భారత పురుషుల జట్టు ఇండోనేసియాను 13-1తో మట్టి కరిపించింది. స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ 4 గోల్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఉషులో విఫలం: పురుషుల చాంగ్‌క్వాన్ ఉషు ఫైనల్‌లో సూరజ్ సింగ్ 11వ స్థానంలో నిలిచాడు. అపర్ణ దహియా, విక్రాంత్ బలియన్ ప్రీక్వార్టర్స్‌లోనే ఓడారు.
స్విమ్మింగ్‌లోనూ చుక్కెదురు: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్స్‌లో రిషభ్ దాస్ 26.56 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బెనిస్టన్ 12వ స్థానంలో నిలిచాడు.
బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌కు: మహిళల టీమ్ ఈవెంట్‌లో సింధు, ఉన్నతి, తన్వీ తమ ప్రత్యర్థులను ఓడించడంతో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో జపాన్‌తో తలపడనున్నారు.
టీటీలో మిశ్రమ ఫలితాలు: టీటీలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల, మహిళల విభాగంలో భాగంగా తమ గ్రూప్ ‘ఎఫ్’లో ఇండోనేసియా జట్లతో జరిగిన మ్యాచ్‌లో 3-0తో గెలిచాయి. ఇక రెండో మ్యాచ్‌లో సింగపూర్‌పై మహిళల జట్టు 3-2తో నెగ్గగా.. పురుషుల జట్టు 0-3తో ఇరాన్ చేతిలో ఓడింది.
ఆసియాడ్‌లో భారత షెడ్యూల్ నేడు
బ్యాడ్మింటన్: పురుషుల తొలి రౌండ్‌లో భారత్‌గీబంగ్లాదేశ్ (ఉ. 11.30); బాక్సింగ్: పురుషుల 70 కిలోల రౌండ్-32లో సుమీత్ (మ. 2.45); హాకీ: మహిళల పూల్-బిలో భారత్ గీఇండోనేసియా (ఉ. 9.30); కబడ్డీ: పురుషుల గ్రూప్-ఎలో భారత్‌గీజపాన్ (ఉ. 9.45), మహిళల గ్రూప్-ఎలో భారత్‌గీబంగ్లా (సా. 4.25); మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్: మహిళల ట్రెడిషనల్ 60 కిలోల సెమీ్‌సలో సుచికా తరియాల్ (ఉ. 8.30); సెపక్ తక్రా: పురుషుల టీమ్ రేగు గ్రూప్-బిలో భారత్‌గీజపాన్ (ఉ. 5.30); షూటింగ్: పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్, ఫైనల్- హిమాన్షు డిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ (ఉ. 6.15), మహిళలు, పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్లు (ఉ. 6.30); సాఫ్ట్ టెన్నిస్: మిక్స్‌డ్ డబుల్స్ గ్రూప్-బిలో ఆదిత్య/జై మీనా (ఉ. 5.30); స్విమ్మింగ్: పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్-2లో రిషభ్, శ్రీహరి నటరాజ్ (ఉ. 6.32), పురుషుల 50 మీ. ఫ్రీస్టైల్ హీట్స్‌లో ఆకాశ్, జితేశ్ (ఉ. 6.46), పురుషుల 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ హీట్-2లో ధనుష్ (ఉ. 7.10); టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ గ్రూప్-ఎ్‌ఫలో భారత్‌గీపాకిస్థాన్ (ఉ. 6.30), పురుషుల గ్రూప్-ఎ్‌ఫలో భారత్‌గీపాకిస్థాన్ (మ. 3.30); ఉషు: మహిళల 60 కిలోల్లో రోషిబినా, పురుషుల 56 కిలోల్లో ఆర్యన్ (మ. 3).
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ
న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?