Share News

ఆసియా క్రీడలు: సెమీస్ డ్రా.. సుచిక ఫైనల్‌కు వెళ్లకపోవడం వెనుక వింత రూల్!

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:32 PM

భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ సుచిక తరియల్ చరిత్ర సృష్టించింది. మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి.. ఆసియా క్రీడల్లో భారత MMAకు తొలి పతకాన్ని అందించింది.

ఆసియా క్రీడలు: సెమీస్ డ్రా.. సుచిక ఫైనల్‌కు వెళ్లకపోవడం వెనుక వింత రూల్!
Suchika Tariyal

ఇంటర్నెట్ డెస్క్: భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) అథ్లెట్ సుచిక తరియల్ చరిత్ర సృష్టించింది. మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి.. ఆసియా క్రీడల్లో భారత MMAకు తొలి పతకాన్ని అందించింది. అయితే సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో చేతిలో ఓటమి పాలవడంతో స్వర్ణ పతక పోరుకు దూరమైంది. సెమీఫైనల్‌లో సుచిక, టియో మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా విజేత ఎవరో తేలలేదు. దీంతో పోరు ఓవర్‌టైమ్‌కు వెళ్లింది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ చివరకు సింగపూర్ అథ్లెట్‌ను విజేతగా ప్రకటించారు.


డ్రా అయినా.. సుచిక ఎందుకు ఓడినట్లు?

ఇక్కడే ఆసియా క్రీడల MMA నిబంధనలోని ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. నిర్దిష్ట సమయం వరకూ ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచినా.. టియో ఆధిపత్యం ప్రదర్శించిందని ముగ్గురు రిఫరీలు భావించారు. దీంతో ఆమెను విజేతగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఫలితంపై భారత బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పది మంది అధికారులు రివ్యూ చేసి మ్యాచ్ డ్రా అయినట్లు ప్రకటించారు. పోరు డ్రాగా ముగిసినప్పుడు అమల్లోకి వచ్చే టైబ్రేక్ నిబంధన ప్రకారం.. తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా ప్రకటిస్తారు. సుచిక తరియల్ తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో.. ఈ నిబంధన ఆమెకు ప్రతికూలంగా మారింది. దీంతో సింగపూర్ అథ్లెట్ టియోను విజేతగా ప్రకటించారు. ఫలితంగా సుచిక ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 02:32 PM