ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:05 PM
ఆసియా క్రీడల్లో 13 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించింది చైనాకు చెందిన యంగ్ అథ్లెట్. స్విమ్మింగ్‌లో యు జిడి అనే బాలిక స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో 13 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించింది చైనాకు చెందిన యంగ్ అథ్లెట్. స్విమ్మింగ్‌లో యు జిడి అనే బాలిక స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్‌లో 2:05.08 టైమింగ్‌తో పసిడిని ముద్దాడి చరిత్ర సృష్టించింది. యు జిడి తన ప్రత్యర్థి చాంగ్ మొహాన్ కంటే మూడు సెకన్లకు ముందుగానే రేసును ముగించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో చైనాకే చెందిన స్టార్ స్విమ్మర్ జాంగ్ యుఫెయి రికార్డును బద్దలు కొట్టింది.

ఇప్పటికే ప్రపంచ వేదికపై యు జిడి తన ముద్ర వేసింది. 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా రిలే జట్టులో భాగంగా కాంస్య పతకం సాధించి.. స్విమ్మింగ్ చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అయితే ఆసియా క్రీడల స్వర్ణం ఆమెకు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఆమె కెరీర్‌లో తొలి ప్రధాన వ్యక్తిగత టైటిల్. అది కూడా ఆసియా క్రీడల రికార్డుతో సాధించడం విశేషం.
ఒలింపిక్స్‌పై కన్ను..
ఈ విజయంతో సంతృప్తి చెందడం లేదని ఈ 13 ఏళ్ల స్విమ్మర్ చెబుతోంది. ‘నేను ఇంకా వేగంగా ఈదాలని కోరుకుంటున్నా. ఈ పోటీల్లో నా టైమింగ్‌ను 0.9 సెకన్లు మెరుగుపరుచుకున్నా. మళ్లీసారి ఇంకా మెరుగ్గా రాణిస్తానని నమ్ముతున్నా. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే నా లక్ష్యం. ప్రతిరోజూ కష్టపడి శిక్షణ తీసుకుంటున్నా. విజయం ఒక్కరోజులో రాదు’ అని యు జిడి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్
ఆసియా క్రీడలు: సెమీస్ డ్రా.. సుచిక ఫైనల్‌కు వెళ్లకపోవడం వెనుక వింత రూల్!