Share News

ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:18 PM

ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు తొలి స్నేహితుడిగా మారిన విషయాన్ని కోమల్ అనే యువతి సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్
Pune woman viral video

ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఉద్యోగం.. కొత్త నగరం.. చుట్టూ అంతా తెలియని వ్యక్తులే. ఇలాంటి సమయంలో పలకరించే ఓ మనిషి కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాడు. పుణెలో ఉద్యోగం కోసం వెళ్లిన కోమల్ కోథావాలే అనే యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు తొలి స్నేహితుడిగా మారిన విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


‘కొత్త ఉద్యోగంలో చేరేందుకు సుమారు రెండు నెలల క్రితం నేను గోవా నుంచి పుణెకు వచ్చాను. ఉండటానికి రూమ్ దొరక్కపోవడంతో నేరుగా లగేజ్‌తో ఆఫీస్‌కి వెళ్లా. అయితే లగేజ్‌ను ఆఫీస్‌లోకి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో సెక్యూరిటీ గార్డును అడిగి వాటిని సాయంత్రం వరకు ఆయన గదిలో పెట్టుకోవచ్చా? అని అడిగాను. ఎలాంటి సంకోచం లేకుండా.. వెంటనే అంగీకరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మేమిద్దరం పలకరించుకుంటున్నాం. ఆఫీస్‌లో ఈ సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడిగా మారిపోయాడు’ అని కోమల్ వెల్లడించింది.


తాను సాధారణంగా ఆలస్యంగా ఆఫీస్ నుంచి బయలుదేరుతానని చెప్పిన కోమల్.. సొంతూరికి వెళ్లాల్సి రావడంతో ఆ రోజు ముందుగానే వెళ్లాలని నిర్ణయించుకుంది. తాను 5.30 గంటలకే వెళ్లడం చూసి సెక్యూరిటీ గార్డు ఆశ్చర్యపోతారని ముందే ఊహించి.. ఆ క్షణాన్ని వీడియో తీసింది. ఆ వీడియోలో ఆమెను చూసిన సెక్యూరిటీ గార్డు.. ‘ఈరోజు 5.30 గంటలకే ఎందుకు వెళ్తున్నారు? సాధారణంగా 8 గంటలకు కదా వెళ్తారు?’ అని అడిగాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన కోమల్.. ‘ఈరోజైనా నేను తొందరగా వెళ్తున్నందుకు ఆయన సంతోషపడుతున్నారని అనుకుంటున్నా. చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటం ఎంతో ముఖ్యం. అలా మాట్లాడినప్పుడే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. జీవితం అందరికీ సులభంగా ఉండదు. కానీ ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి’ అని కోమల్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 03:32 PM