సెలవుల ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:17 PM
గుడ్‌ఫ్రైడేతో పాటు శని, ఆదివారాలు కలిసి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో నగర వాసులు తమ సొంతూళ్ళకు క్యూకట్టారు.
కిటకిటలాడుతున్న విమానాశ్రయాలు
చెన్నై: గుడ్‌ఫ్రైడేతో పాటు శని, ఆదివారాలు కలిసి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో నగర వాసులు తమ సొంతూళ్ళకు క్యూకట్టారు. దీని కారణంగా విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.. కాగా రద్దీ దృష్ట్యా విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అనేక రూట్లలో ప్రయాణ చార్జీలను విమానయాన సంస్థలు పెంచేశాయి. రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో విహారయాత్రలకు, సొంతూళ్ళకు నగర పయనమవుతున్నారు. అయితే, రైళ్ళు, బస్సుల్లో రిజర్వేషన్ టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో విమాన టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపారు.
దీంతో విమాన చార్జీలను విమాన సంస్థలు ఒక్కసారిగా పెంచేశాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, కొచ్చి, బెంగుళూరు, హైదరాబాద్‌తో పాటు పలు ఉత్తరాది నగరాలకు వెళ్ళే విమానాల్లో చార్జీలు విపరీతంగా పెంచేశారు. ప్రధానంగా చెన్నై తూత్తుకుడి ప్రాంతాల మధ్య కనిష్టంగా రూ.6,503గా ఉండే ప్రయాణ చార్జీ ఇపుడు రూ.17,021కి చేరింది. అలాగే, చెన్నై మదురై మధ్య రూ.13,147 (సాధారణ రోజుల్లో రూ.5,467), చెన్నై-తిరుచ్చి మధ్య రూ.5,615 (రూ.4,521),
చెన్నై-కోవై మధ్య రూ.16,496 (రూ.4,966), చెన్నై సేలం మధ్య రూ.5,051 (రూ.4,088), చెనై కొచ్చిన్ మధ్య రూ.18,071 (రూ.4,840), చెన్నై - బెంగళూరు మధ్య రూ.16,496 (రూ.3,071), చెన్నై హైదరాబాద్ మధ్య రూ.19,453 (రూ.4,779)మేర పెంచేశారు. అయినప్పటికీ చాలామంది విమాన ప్రయాణాలకు ఆసక్తి చూపడంతో విమానాశ్రయాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఎయిర్‌పోర్టుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటుచేసి, నిఘా పెంచారు.
తిరుచ్చి-కువైట్‌కు విమాన సేవలు
చెన్నై: తిరుచ్చి విమానాశ్రయం నుంచి మలేసియా, సింగపూర్, మస్కట్, ఒమన్, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఆ దేశాలకు విమాన సేవలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో, తిరుచ్చి నుంచి సౌదీ మీదుగా కువైట్‌కు కొత్త విమాన సేవలు నడుపనున్నట్లు జెజీరా విమాన సంస్థ ప్రకటించింది. ఈ ప్రకారం, ఈ నెల 7వ తేది నుంచి మంగళ, ఆదివారాల్లో రాత్రి 8.25 గంటలకు కువైట్ నుంచి బయల్దేరే విమానం తిరుచ్చి విమానాశ్రయానికి ఉదయం 4.40 గంటలకు వచ్చి చేరుతుంది. మరుమార్గంలో, తిరుచ్చి విమానాశ్రయం నుంచి బుధ, ఆదివారాల్లో ఉదయం 5.25 గంటలకు బయల్దేరే విమానం రాత్రి 8.25 గంటలకు కువైట్ చేరుకుంటుందని సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
Read Latest Telangana News and National News