తప్పుచేసే పోలీసులను ప్రశ్నించడం తప్పా: పేర్ని నాని
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:58 AM
మచిలీపట్నం కొబ్బరితోట ఘటనలో తనపై పోలీస్ కేసు నమోదు కావడంపై పేర్ని నాని స్పందించారు. తప్పుచేసే పోలీస్ అధికారులను ప్రశ్నించడం తప్పా అని ఆయన జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుణ్ని నిలదీశారు.
ఇంటర్నెట్ డెస్క్: మచిలీపట్నం కొబ్బరితోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై పేర్ని నాని స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికార సంఘం అధినేత జయపాల్.. ప్రెస్‌మీట్లో మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు.
'నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను చూసి జయపాల్ మాట్లాడిఉంటే బాగుండేది. అక్కడ జరిగిన సంఘటన ఏమిటి? ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిందేమిటి.? వైసీపీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తి పేర్ని కిట్టు. ఆయనతో పాటు కార్పొరేటర్లు వచ్చి అండగా నిలబడ్డారు. గత ప్రభుత్వంలో ఏ పేదవాని ఇంటినీ మేం కూల్చలేదు. కానీ మున్సిపల్ అధికారులు ఇప్పుడు కొబ్బరితోటలను కూల్చడం ప్రారంభించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని తెలిపారు.. బాగుంది. కానీ అక్కడ ఏం జరిగిందో జయపాల్ తెలుసుకోకుండా.. బాడీ షేమింగ్ చేశారని ఎలా మాట్లాడారు? అసలు ఆ సీఐని మేమెక్కడా ఉదహరించలేదు. ఆయన పేరుతో ఏమీ అనలేదు. అయినా ఏకవచనంతో మీరు మాట్లాడవచ్చా?' అని పేర్ని నాని ప్రశ్నించారు.
'నా మీద, నా కొడుకు మీద అక్రమ కేసులు కట్టారు. కేవలం పబ్లిసిటీ కోసం ఎవరు ఎదిగారు? ఎవరు ఆరాటపడుతున్నారు? జయపాల్.. నాకు రాజకీయ పబ్లిసిటీ దేనికి? నేను ప్రజలకోసం పోరాటంచేసే వ్యక్తిని? కొందరు పోలీసులు భయంలేకుండా తప్పులు చేస్తున్నారు. మీలా అందరూ మంచి వ్యక్తులు లేరు. పోలీస్ వ్యవస్థ మారింది. పోలీసులు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే అప్పుడు ప్రజలకు పోలీసులతో అవసరమేమీ ఉండదుగా.!' అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి. రెడ్‌బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ అధికారికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ నాలుగు జిల్లాల అవతలికి ఎందుకు పంపారన్నారు.
పోలీస్ వ్యవస్థలో తప్పుచేసిన కొందరు అధికారులను ప్రశ్నించడం తప్పా అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు పేర్ని నాని. మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నోసార్లు పోలీస్ అధికారులను తిట్టారుగా.? అప్పుడీ పోలీస్ జిల్లాధ్యక్షుడికి(జయపాల్‌ను ఉద్దేశించి) కనపించలేదా.? మరప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 'పోలీసులు సుదీర్ఘ కాలం పనిచేస్తారు. కానీ ఎక్కడా ఎక్కువ కాలం ఉండరు. పవిత్రమైన యూనిఫామ్ వెనుక తప్పుచేసే అధికారిని మాత్రమే మేం ప్రశ్నించాం. అంతేతప్ప నేనెప్పుడూ ఏ పోలీస్ అధికారినీ ఉద్దేశపూర్వకంగా అనలేదు. తప్పుచేసే వ్యక్తులను నిలదీయడం మీ దృష్టిలో తప్పా?' అని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు