Share News

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌.! రాష్ట్రపతి నామినేట్

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:26 AM

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్‌ కొనసాగే అవకాశముంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను శుక్రవారం నామినేట్ చేశారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌.! రాష్ట్రపతి నామినేట్
Harivansh Narayan Singh

ఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే వ్యక్తిగా ఆయనకు ఉన్న గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్ ఎగువసభలో అత్యంత హుందాతనం గల నేతగా పేరుగాంచిన హరివంశ్.. మరోసారి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Droupadi Murmu) ఆయనను నామినేట్ చేశారు.


జర్నలిజం నుంచి పార్లమెంటరీ అత్యున్నత పదవి వరకు..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం.. సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. హరివంశ్ తనకున్న సుదీర్ఘ జర్నలిజం అనుభవం, సామాజిక స్పృహతో ఈ కోటాలో ఎంపికయ్యారు.

జేడీయూ నుంచి నామినేటెడ్ వరకు..

బిహార్ నుంచి జేడీయూ(JD-U) తరఫున ఎన్నికైన ఆయన సభ్యత్వ కాలం ఏప్రిల్ 9వ తేదీన ముగిసింది. సాధారణంగా పార్టీ కోటాలో సభ్యత్వం ముగిసిన తర్వాత తిరిగి పార్టీ టికెట్‌పైనే వస్తుంటారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రపతి కోటా ద్వారా నేరుగా సభకు పంపడం గమనార్హం.


డిప్యూటీ ఛైర్మన్‌గా రికార్డు..

రాజ్యసభ 13వ డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన పనిచేసిన తీరు అమోఘం. క్లిష్టమైన బిల్లుల చర్చ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు, ఆయన చూపిన ప్రతిభ, నిష్పక్షపాత నిర్ణయాలు అధికార, ప్రతిపక్షాల మన్ననలు పొందాయి. హరివంశ్ నారాయణ్ సింగ్‌ను మళ్లీ సభకు పంపడం వెనుక కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక వ్యూహాలను రచించిన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సభా నిర్వహణలో పట్టు..

ఎగువ సభలో ప్రతిపక్షాల బలం గణనీయంగా ఉన్నప్పుడు, సభను సమర్థవంతంగా నడపగలిగే వ్యక్తుల అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. హరివంశ్ ఆ విషయంలో ఇప్పటికే తన సత్తా చాటారు. తాజా నామినేషన్‌తో ఆయన మళ్లీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేటెడ్ సభ్యుడిగా ఉంటూ ఈ బాధ్యతలు చేపడితే, అది సభకు మరింత గౌరవాన్ని తెస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


రాజకీయాల్లో హుందాతనం..

సీనియర్ జర్నలిస్టుగా హరివంశ్‌కున్న విలువలు, రాజకీయాలకు అతీతంగా ఆయనకు ఉన్న ఆదరణ ప్రభుత్వానికి సానుకూల అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో హుందాతనం తగ్గుతున్న కాలంలో, హరివంశ్ నారాయణ్ సింగ్ వంటి సీనియర్ల సేవలను వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని తెలిపారు. రంజన్ గొగొయ్ స్థానంలో ఓ అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్ రావడం సభ గౌరవాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. హరివంశ్ నారాయణ్ సింగ్ మళ్లీ డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు చేపడితే.. సభలో చర్చల నాణ్యత మరింత మెరుగుపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 11:37 AM