'మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
ABN , Publish Date - Oct 01 , 2026 | 08:29 PM
సరదాగా సాగాల్సిన విహారయాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పుణె నుంచి పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల్లో 8 మంది సముద్రంలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ విహారయాత్ర విషాదంగా మారింది. రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగార్ బీచ్‌కు పిక్నిక్ కోసం వెళ్లిన 8 మంది కళాశాల విద్యార్థులు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు, స్థానికులు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
పుణెలోని అలందీకి చెందిన ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 48 మందితో కూడిన ఓ టీమ్ దివేగార్ బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లింది. ఇందులో 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో కొందరు విద్యార్థులు సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లారు. కానీ అందులో 8 మంది తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు. చివరకు గల్లంతైన ఆ విద్యార్థులంతా మంది శవాలై తేలారు.
అయితే.. ఆ విద్యార్థులు సముద్రం లోతు, ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శవ పంచనామా ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
పది రోజుల క్రితం..
కాగా.. సరిగ్గా పది రోజుల క్రితం బిహార్‌లోని భాగల్‌పుర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 'కర్మ-ధర్మ' పండుగ సందర్భంగా చెరువులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొలుత ఓ బాలుడు లోతైన నీటిలోకి వెళ్లగా.. అతణ్ని కాపాడే ప్రయత్నంలో మిగిలిన వారు కూడా నీటిలో మునిగిపోయారు.
ఇవీ చదవండి:
స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!