Share News

సీఈసీ రాజీనామా చేయాలి.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు: ఖర్గే, నారాయణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:49 PM

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల SIRను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఐ నేత నారాయణ కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

సీఈసీ రాజీనామా చేయాలి.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు: ఖర్గే, నారాయణ
CEC Resignation Demand

CEC Resignation Demand దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా (X) కాంగ్రెస్ పార్టీ తరఫున 3 కీలక డిమాండ్లను లేవనెత్తగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.


కాంగ్రెస్ పార్టీ 3 కీలక డిమాండ్లు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను తక్షణమే రద్దు చేయాలని, రాబోయే అన్ని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలన్న ఈ మూడు డిమాండ్లను ఖర్గే ప్రస్తావించారు.

'ఈ మూడు డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, 'ఇండియా' (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నాయి. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న పౌర సమాజ సభ్యులకు, యువజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఢిల్లీ ఆందోళనల సందర్భంగా మహిళా విలేకరులపై జరిగిన వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో నిరంకుశ పాలకులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.' అంటూ మల్లికార్జున ఖర్గే తన సందేశంలో పేర్కొన్నారు.


ఓట్ల చోరీతో పాటు జేబు చోరీకి తెగబడ్డారు: సీపీఐ నేత నారాయణ

మరోవైపు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ, కేంద్ర ప్రభుత్వం, సీఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో ప్రారంభమైన ఈ SIR వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఎలక్షన్ సిస్టమ్‌లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందన్నారు. వాడవాడలా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని నారాయణ తెలిపారు.

ఒకవైపు ఓట్ల చోరీకి పాల్పడుతూనే, మరోవైపు యూపీఐ (UPI) ని ప్రవేశపెట్టి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం జేబు చోరీకి తెగబడిందని కూడా నారాయణ మండిపడ్డారు. గతంలో విద్యామంత్రి రాజీనామాతో ప్రధాని మోదీ గండం నుంచి బయటపడ్డారని, అయితే ఇప్పుడు ఈ సీఈసీ వ్యవహారం నేరుగా ప్రధాని మోదీ మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యుద్ధ విరమణ కోసం భారత్‌ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి

రష్యా డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌ ధ్వంసం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2026 | 12:49 PM