కనుమెరుగు

ABN , First Publish Date - 2022-11-09T23:47:33+05:30 IST

మగ్గంపై పట్టుచీర నేయడం ఒక ఎత్తయితే.. దానిని మగువలు మెచ్చేలా మెరుగులు దిద్దడం (పాలిషింగ్‌) మరో ఎత్తు. పట్టు చీరల తయారీలో పాలిషింగ్‌ పరిశ్రమ కూడా కీలకం. పట్టు కేంద్రమైన ధర్మవరంలో ఒకప్పుడు పాలిషింగ్‌ పరిశ్రమ ఓ వెలుగు వెలిగింది.

	కనుమెరుగు
పట్టుచీరకు మెరుగులు దిద్దుతున్న కార్మికులు

సంక్షోభంలో పట్టుచీరల పాలిషింగ్‌ పరిశ్రమ

భారమైన విద్యుత చార్జీలు.. ముడిసరుకు ధరలు

కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం

వీధినపడ్డ కార్మిక కుటుంబాలు

ధర్మవరం

మగ్గంపై పట్టుచీర నేయడం ఒక ఎత్తయితే.. దానిని మగువలు మెచ్చేలా మెరుగులు దిద్దడం (పాలిషింగ్‌) మరో ఎత్తు. పట్టు చీరల తయారీలో పాలిషింగ్‌ పరిశ్రమ కూడా కీలకం. పట్టు కేంద్రమైన ధర్మవరంలో ఒకప్పుడు పాలిషింగ్‌ పరిశ్రమ ఓ వెలుగు వెలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి వేల మంది జీవించేవారు. చేనేత పరిశ్రమ దెబ్బతినడంతో ఆ ప్రభావం పాలిషింగ్‌పై కూడా పడింది. పాలిషింగ్‌ పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. అరకొరగానే పని దొరుకుతోంది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ విధానాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. విద్యుత చార్జీల పెంపు పాలిషింగ్‌ పరిశ్రమను కోలుకోలేని దెబ్బకొట్టింది. పట్టుచీరలకు మెరుగులు అద్దడం ద్వారా వచ్చే పదో.. పాతిక కూడా విద్యుత బిల్లులకు సరిపోతోంది. ముడిసరుకుల ధరలు పెరగడం మరింత భారమవుతోంది. వెరసి, పాలిషింగ్‌ కార్మికులు ఉపాధి కోల్పోయి, వీధిన పడుతున్నారు. ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

వేల మందికి జీవనాధారం

ధర్మవరం పట్టుచీర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అందులో పట్టుచీరలకు మెరుగులు దిద్వే (పాలిషింగ్‌) కార్మికుల పాత్ర కూడా ఉంది. చేనేత కార్మికుడి వద్ద తయారైన చీరకు మెరుగులు దిద్ది, ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో పాలిషింగ్‌ కార్మికుల ప్రతిభ అమోఘమనే చెప్పాలి. గతంలో ఈ రంగంపై ఆధారపడి వందలాది కార్మిక కుటుంబాలు జీవించేవారు. జిల్లాలో చేనేత కేంద్రాలైన ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, హిందూపురం, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో 1500 దాకా పాలిషింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోనే 300 దాకా ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలకుపైగా కార్మికులు.. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. శ్రమకు తగ్గ కూలి దక్కేది. చేనేత కార్మికుడు తయారు చేసిన పట్టుచీరలపై పాలిషింగ్‌ కార్మికులు ఎయిర్‌ ఫ్రెషర్‌ మిషన ద్వారా గమ్‌ స్ర్పే చేస్తారు. తరువాత ఒకరోజు పాటు ఎండరో ఆరబెట్టి, చక్కగా మడతేస్తారు.

చేనేతలపైనే ఈ పరిశ్రమ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ ప్రభావం పాలిషింగ్‌ కార్మికులపై కూడా పడింది. పాలిషింగ్‌ చీరలు రాక, ఉపాధి కోల్పోతున్నారు. ఒక్కో చీరకు పాలిష్‌ చేసి మెరుగులు దిద్దితే రూ.30 కూలీ వస్తుంది. ముడిసరుకుల ధరలు పెరిగి, చీరలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో మగ్గాల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో పాలిషింగ్‌కు చీరలు ఇచ్చే వారు లేరు. దీంతో పాలిషింగ్‌ పరిశ్రమ కూడా సంక్షోభం బాట పట్టింది. ఇప్పటికే కునారిల్లిన పాలిషింగ్‌ పరిశ్రమను పెరిగిన విద్యుత చార్జీలు, కోతలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. పట్టుచీర పాలిషింగ్‌ ద్వారా వచ్చే రూ.30 కూడా విద్యుత బిల్లులకే సరిపోతోందని కార్మికులు వాపోతున్నారు. గతంలో నెలకు ఒక్కో పాలిషింగ్‌ సెంటర్‌కు కరెంట్‌ ఖర్చు రూ.200 వరకు వచ్చేది. కరెంట్‌ చార్జీల పెంపుతో ప్రస్తుతం రూ.600 వరకు బిల్లు వస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క చీరకు మెరుగులు దిద్దితే రూ.30 కూలీ ఇస్తారు. 15 ఏళ్లగా ఇదే కూలి అమలులో ఉంది. పెరిగిన ధరలతో ఈ కూలి ఎందుకూ చాలట్లేదు.

ప్రోత్సాహం ఏదీ..?

గాలిమిషనకు ఒక పైప్‌ను అమర్చి, గమ్‌ ఇతర రసాయనాలను దాని ద్వారా పట్టు చీరపై స్ర్పే చేసి, కార్మికులు పాలిష్‌ చేస్తారు. తరువాత పట్టుచీర బిగుతుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పరిశ్రమకు ఏ ఒక్క పథకం కానీ, సబ్సిడీకానీ, బ్యాంకు రుణాలు కానీ వర్తించవు. పాలిషింగ్‌ కార్మికులను చేనేత కార్మికులుగా పరిగణించకపోవడంతో వారికి ప్రభుత్వ సాయం ఏ మాత్రం అందట్లేదు. దీంతో ఆ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికైనా పాలకులు.. ముడిసరుకుల ధరలు తగ్గించి, ప్రోత్సాహకాలు అందించి పాలిషింగ్‌ పరిశ్రమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

కూలి కూడా దక్కట్లేదు

చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం, విద్యుత చార్జీలు విపరీతంగా పెంచడంతో చీరల పాలిషింగ్‌కు కూలి కూడా దక్కట్లేదు. పదేళ్లుగా పట్టుచీర పాలిషింగ్‌ కూలి రూ.30గానే ఉంది. అందుకు ఉపయోగించే ముడిసరుకుల ధరలు మాత్రం మూడింతలయ్యాయి. దీంతో ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు.

దాసరి దేవానంద్‌, పాలిషింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు

ప్రభుత్వం గుర్తించాలి

పట్టుచీరలకు పాలిష్‌ చేసే కార్మికులను ప్రభుత్వం గుర్తించి, ఆదుకోవాలి. వారికి సబ్సిడీ రుణాలివ్వాలి. కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులను మంజూరుచేసి, సంక్షేమపథకాలు వర్తింపజేయాలి.

పోలా రామాంజనేయులు, ఏపీచేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2022-11-09T23:47:37+05:30 IST