యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:41 AM
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం కోసం భారతదేశం చేసిన ప్రతిపాదనలు అత్యంత సమగ్రంగా ఉన్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అన్నారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 4: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం కోసం భారతదేశం చేసిన ప్రతిపాదనలు అత్యంత సమగ్రంగా ఉన్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అన్నారు. యుద్ధ విరమణ కోసం ఉక్రెయిన్ ముందు ప్రస్తుతం నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అమెరికా, ఈజిప్టు, తుర్కియే దేశాలు కూడా తమ ప్రతిపాదనలను ఉక్రెయిన్‌కు సమర్పించాయన్నారు. అయితే, రెండు దేశాలూ ఇంధన, విద్యుత్, మౌలిక వసతులు, పోర్టులపై దాడులను పూర్తిగా ఆపివేయాలని, నల్ల సముద్రం ద్వారా ఆహార ధాన్యాలు, సరుకు రవాణాకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని భారత్ చేసిన ప్రతిపాదనలు చాలా సమగ్రంగా, ఏకపక్షం కాకుండా ఉన్నాయని వివరించారు. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని సిబిహా అన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల పుతిన్ కూడా.. ‘‘యుద్ధం ముగించడానికి భారత ప్రధాని మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు.