సుప్రీంకోర్టు ఆగ్రహం.. కులగణన పిటిషన్ కొట్టివేత.. పిటిషనర్‌కు చుక్కెదురు!
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:48 PM
కుల గణన, జనాభా నియంత్రణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కుల గణన, జనాభా నియంత్రణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పిటిషనర్ అనుసరించిన తీరు, పిటిషన్‌లో వాడిన భాషపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న కులగణన (Caste Census) ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే తోసిపుచ్చింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
పిటిషన్‌లో వాడిన భాషపై ‘చీఫ్ జస్టిస్’ సీరియస్
ఈ విచారణలో భాగంగా పిటిషనర్ స్వయంగా హాజరయ్యారు. అయితే, పిటిషన్‌లో పొందుపరిచిన అంశాలు, వాడిన పదజాలం చూసి ధర్మాసనం నివ్వెరపోయింది. ‘మీరు ఈ భాష ఎక్కడ నేర్చుకున్నారు?, న్యాయస్థానంలో దాఖలు చేసే పిటిషన్లు ఇలాగేనా రాసేది?’ అంటూ జస్టిస్ సూర్య కాంత్ పిటిషనర్‌ను నిలదీశారు. న్యాయస్థానానికి సమర్పించే పత్రాలలో కనీస మర్యాద, స్పష్టత ఉండాలని, అడ్డగోలు భాషతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హెచ్చరించారు.
జనాభా నియంత్రణ విజ్ఞప్తులూ తిరస్కరణ..
కేవలం కులగణనే కాకుండా, ఈ పిటిషన్‌లో జనాభా నియంత్రణ (Population Control) విధానాలపై కూడా పిటిషనర్ పలు విన్నపాలు చేశారు. ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఇలాంటి విధాన నిర్ణయాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, కోర్టులు వీటిపై ఆదేశాలు ఇవ్వలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన వేదిక కాదని పేర్కొంటూ ఆ విజ్ఞప్తులను తోసిపుచ్చింది. కుల గణన అనేది సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని, దానిని అడ్డుకోవడానికి తగిన బలమైన కారణాలు పిటిషన్‌లో లేవని సుప్రీంకోర్టు భావించింది. అలాగే, న్యాయస్థానాన్ని ఆశ్రయించే వారు రాజ్యాంగబద్ధమైన భాషను, పద్ధతిని పాటించాలని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
Read Latest Telangana News And AP News And International News And Telugu News