Share News

I-PAC Riads: టీఎంసీ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన కోల్‌కతా హైకోర్టు

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:04 PM

టీఎంసీ సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్‌కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది.

I-PAC Riads: టీఎంసీ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన కోల్‌కతా హైకోర్టు
Mamata Banerjee

కోల్‌కతా: ఐ-ప్యాక్ (I-PAC) సంస్థపై ఇటీవల జరిపిన దాడుల్లో తమ పార్టీ ఫైళ్లు, ఎన్నికలకు సంబంధించిన డేటాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ED) సీజ్ చేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) బుధవారం నాడు డిస్పోజ్ చేసింది. సుప్రీంకోర్టులో ఇదే తరహా పిటిషన్ వేసినట్టు ఈడీ చెప్పడంతో ఆ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈడీ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు విచారణ జరుపనుంది.


టీఎంసీకి సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్‌కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది. ఇది డేటా భద్రతకు సంబంధించిన అంశమే అయితే ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని తాము కట్టుబడి ఉంటామని, ఈడీ ఎలాంటి డేటాను స్వాధీనం చేసుకోలేదని, ఇందుకు భిన్నంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఆ డేటా తీసుకువెళ్లారని తెలిపింది. తమ తనిఖీలతో తృణమూల్ కాంగ్రెస్‌కు అసలు సంబంధమే లేదని వివరించింది. కాగా, ఎన్నికలకు సంబంధించిన తమ పార్టీ డేటాను ఈడీ సీజ్ చేసినందున ఆ డేటాకు భద్రత కల్పించాలని కోర్టును టీఎంసీ కోరింది.


ఈడీ దాడులు

తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన పేపర్లు, పార్టీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సమాచారం కలిగిన కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, కీలకమైన డిజిటల్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ప్రయత్నించినట్టు ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. లీగల్ ఇన్వెస్టిగేషన్‌ను రాజకీయ అంశంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధ పాలనను బలహీన పరిచేందుకు సీఎం ప్రయత్నించినట్టు ఆరోపించింది. దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి చర్యలనైనా తాము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి చర్యల వల్ల సంస్థల విశ్వసనీయతకు భంగం కలుగుతుందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

బీజేపీతో పొత్తుండదు.. తెగేసి చెప్పిన టీవీకే

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 14 , 2026 | 05:38 PM