Vijay TVK: బీజేపీతో పొత్తుండదు.. తెగేసి చెప్పిన టీవీకే
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:41 PM
'జన నాయగన్' విడుదలను అడ్డుకోవడం, విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు పంపడం వంటి చర్యల ద్వారా టీవీకేపై బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)తో చేతులు కలిపే ప్రసక్తే లేదని సినీ నటుడు విజయ్ (Actor Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తెలిపింది. పొత్తుల విషయంలో తమ పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉందని టీవీకే డిప్యూటీ సెక్రటరీ నిర్మల్ కుమార్ (Nirmal Kuamr) తెలిపారు. పొంగల్ రేసులో విడుదలకు సిద్ధమైన విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan) చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందనే విమర్శలు రావడం, కరూర్ తొక్కిసలాట ఘటనపై మరోసారి విచారణకు ఈనెల 19న హాజరుకావాలని విజయ్‌కు సీబీఐ సమన్లు పంపిన నేపథ్యంలో టీవీకే తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 12న విజయ్‌ను సీబీఐ ఆరు గంటల సేపు విచారణ చేసింది . మరుసటి రోజు కూడా విచారణకు రావాలని కోరినప్పటికీ పొంగల్ కారణంగా ఆయన గడువు కోరారు. విచారణ అనంతరం విజయ్ తిరిగి చెన్నైకు చేరుకున్నప్పుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, టీవీకే సైద్ధాంతిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తమకు బీజేపీ సైద్ధాంతిక శత్రువని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ పార్టీతో పొత్తు ఉండదని వెల్లడించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకేతోనూ కలిసేది లేదని తెలిపారు.
జన నాయగన్ విడుదల కాకుండా కేంద్రం అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే విమర్శించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందన్నారు. తమిళ ప్రజల వాణిని అణిచివేయాలి మోదీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. దీనిపై కూడా నిర్మల్ కుమార్ స్పందించారు. 'జన నాయగన్'కు ఎవరు సపోర్ట్ ఇచ్చినప్పటికీ తాము స్వాగతిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై తమ పార్టీ అధినేత విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కాగా, 'జన నాయగన్' విడుదలను అడ్డుకోవడం, విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు పంపడం వంటి చర్యల ద్వారా టీవీకేపై బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి