Chennai News: మదురై కాదు.. చెన్నైకి మోదీ
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:25 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 23వతేదీన తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనను తొలుత మదురై పట్టణంలో ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించగా.. దానిని రాజధాని చెన్నైకి మార్చారు. వివరాలిలా ఉన్నాయి.
- 23న రానున్న ప్రధాని
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే తరఫున ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఖరారైందని బీజేపీ(BJP) రాష్ట్ర నాయకులు తెలిపారు. అదే సమయంలో ముందుగా అనుకున్నట్లు సభను మదురైకి బదులుగా రాజధాని నగరం చెన్నైలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీయేలో చేరిన అన్నాడీఎంకే ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రంలో ఎన్డీయేని బలపరచటంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదురై నగరంలో ప్రధాని ప్రచార సభ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. గత వారం బీజేపీ నేత నయినార్ నాగేంద్రన్ మదురై ప్రచార సభకు అనువైన ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ప్రధాని మోదీ సభను రాజధాని నగరం చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర నాయకులు తీసుకున్న ఈ నిర్ణయానికి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో నయినార్ నాగేంద్రన్ నగరంలో మోదీసభకు అనువైన రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. మహాబలిపురం సమీపం తిరువిడందై వద్ద సైనిక యుద్ధ సామగ్రి ప్రదర్శన జరిపిన ప్రాంతం మోదీ సభకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థలంతోపాటు పూందమల్లి వద్దనున్న ‘వేల్స్ ఫిల్మ్‌సిటీ’ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాలే కాకుండా చెంగల్పట్టు సమీపంలోను రెండు ప్రాంతాలను ఆయన పరిశీలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!
Read Latest Telangana News and National News