Online Delivery Platforms: ‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:31 AM
తినే ఆహార పదార్థాల నుంచి నిత్యావసర సరుకుల వరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే.
గిగ్ వర్కర్ల ఆందోళన నేపథ్యంలో ఆన్‌లైన్ సంస్థలతో కేంద్రం చర్చలు
వర్కర్ల భద్రతకు సానుకూల నిర్ణయం
నిలిపివేస్తామన్న సంస్థలు
న్యూఢిల్లీ, జనవరి 13: తినే ఆహార పదార్థాల నుంచి నిత్యావసర సరుకుల వరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రకటనలకు అనుగుణంగా.. కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారులు బుక్ చేసుకున్న పదార్థాలు, వస్తువులను గిగ్ వర్కర్ల ద్వారా గడప వద్దకు చేరుస్తున్నాయి. అయితే.. ఈ నిర్దేశిత సమయాన్ని ఎత్తివేయాలని.. తమకు భద్రత కల్పించాలని గిగ్ వర్కర్లు దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. దీంతో ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఆన్‌లైన్ క్విక్ ప్లాట్‌ఫామ్ సంస్థలతో కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం చర్చలు జరిపారు. వర్కర్ల భద్రత దృష్ట్యా డెలివరీకి నిర్దేశించిన 10 నిమిషాల సమయాన్ని ఎత్తివేయాలని సూచించారు. దీనికి ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. తక్షణమే 10 నిమిషాల నిర్దేశిత సమయాన్ని ఎత్తివేస్తున్నట్టు ‘బ్లింకిట్’ తెలిపింది. మిగిలిన సంస్థలు త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అంతేకాదు.. ఆయా సంస్థలు తమ ప్రకటనల నుంచి అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి కూడా ‘10 నిమిషాల నిర్దేశిత డెలివరీ’ హామీని తొలగించనున్నాయి. కాగా, 10 నిమిషాల డెలివరీ సమయాన్ని నిర్దేశించడం.. తమకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, తమకు భద్రత లేకుండా పోయిందని గిగ్ వర్కర్లు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్.. గత ఏడాది డిసెంబరు25-31 మధ్య దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా సంస్థలు 10 నిమిషాల సమయాన్ని తొలగించేందుకు నిర్ణయించాయి.