DK Shivakumar: ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:47 PM
శివకుమార్ పోస్ట్ కీలకమైన రాజకీయ సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను డీకే శివకుమార్ చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 'ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రార్ధనలు విఫలం కావు' అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మైసూరులో మంగళవారంనాడు డీకే కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా పోస్ట్ ఆసక్తిని రేపుతోంది.
శివకుమార్ పోస్ట్ కీలకమైన రాజకీయ సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను డీకే శివకుమార్ చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని సిద్ధరామయ్య చెబుతూ వస్తున్నారు.

రాహుల్‌ను కలిసిన సిద్ధరామయ్య, డీకే
తమిళనాడు నుంచి రాహుల్ తిరిగి వస్తూ మైసూరు విమానాశ్రయంలో దిగినప్పుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో ఆయన వేర్వేరుగా కొద్దిసేపు ముచ్చటించారు. రాహుల్ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తూ మైసూరులో ఆగారు. అయితే ముగ్గురు నేతలు మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయనేది మాత్రం బయటకు రాలేదు. గత నెలలో రాహుల్‌ను కలిసేందుకు శివకుమార్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.
డీకే పోస్ట్ వెనుక..
శివకుమార్ బుధవారంనాడు షేర్ చేసిన పోస్ట్ వెనుక ఉద్దేశం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. డీకేను కొద్ది కాలం ఆగాల్సిందిగా రాహుల్ గాంధీ చెప్పి ఉండవచ్చని, దీనిపై సమగ్రంగా చర్చించేందుకు త్వరలోనే ఇద్దరినీ ఢిల్లీకి పిలుస్తానని రాహుల్ సూచించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే రాహుల్‌తో సంభాషణల్లో ఎలాంటి రాజకీయ ప్రస్తావన చోటుచేసుకోలేదని సిద్ధరామయ్య తెలిపారు. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని, ఊహాగానాలన్నీ మీడియా సృష్టేనని అన్నారు. 2023 మేలో ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పోస్టు విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య గట్టిపోటీ తలెత్తింది. అయితే అధిష్ఠానం డీకేకు నచ్చచెప్పి ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే రొటేషనల్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేందుకు ఒక రాజీ ఫార్ములా అప్పట్లో కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం సిద్ధూ రెండున్నరేళ్ల పాలన అనంతరం డీకే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందం జరిగినట్టు పార్టీ అధికారికంగా ఇంతవరకు ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి..
పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి