Attack on Indian Businessman: కెనడాలో భారత వ్యాపారి హత్య.. దుండగుల కాల్పుల్లో బిందర్ గర్చా మృతి
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:40 PM
కెనడాలో భారత సంతతి వ్యాపారిని దుండగులు కాల్చి చంపారు. మిట్ట మధ్యాహ్నం అతని ఫార్మ్ హౌస్ దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి బిందర్ చర్చా స్థానికంగా ఫొటో స్టూడియో, ఈవెంట్ల షూటింగ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 14: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సర్రే నగరంలో మంగళవారం (జనవరి 13, 2026) భారతీయ మూలాలు కలిగిన పంజాబ్ వ్యాపారి బిందర్ గర్చా(48)పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యాహ్నం 12:05 గంటలకు (కెనడా సమయం) జరిగింది.
బిందర్ గర్చా తన ఫార్మ్ గేట్ దగ్గర (176 స్ట్రీట్ 35 ఏవెన్యూ దగ్గర) ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. సర్రే పోలీసులు, ఫైర్ సర్వీసెస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, బిందర్ స్పాట్ లోనే మృతి చెందాడు.
ఈ కాల్పులపై ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) దర్యాప్తు చేపట్టింది. బిందర్ గర్చా పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి, కెనడాలో వ్యాపారంలో స్థిరపడ్డారు. అతడు Studio-12 (లిమోజిన్ ఈవెంట్ ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ) యజమాని. అలాగే Empress Banquet Hall (పాయల్ బిజినెస్ సెంటర్) కో-ఓనర్‌గా మంచి పేరు సాధించాడు.
బిందర్ గర్చాకు వెడ్డింగ్ వీడియోగ్రఫీ బాగా తెలియడంతో.. స్నేహితులు, స్థానికుల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాడి తర్వాత పోలీసులు సౌత్ సర్రేలో తగులబెట్టిన ఒక వాహనాన్ని కనుగొన్నారు. ఈ వాహనం దుండగులకు చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దాడి ప్రణాళిక ప్రకారం కావాలనే చేసినప్పటికీ, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. సౌత్ ఏషియన్ బిజినెస్ కమ్యూనిటీలో ఇటీవలి కాలంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య భారత సంతతికి చెందిన వారిలో ఆందోళన కలిగిస్తోంది.
బిందర్ గర్చాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ కేసులో ఎవరికైనా సమాచారం తెలిస్తే తెలియజేయాలని కెనడా పోలీసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..