'బోన్ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి.!
ABN , Publish Date - Sep 21 , 2026 | 09:32 PM
గుజరాత్‌లో బోన్ మ్యారో మార్పిడి కోసం చేపట్టిన వైద్య పరీక్షల్లో ఊహించని మలుపు తిరిగింది. కుమారుడి బోన్ మ్యారో భర్తకు సరిపోలకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో బోన్ మ్యారో(ఎముక మజ్జ) మార్పిడి కోసం చేపట్టిన వైద్య పరీక్షల్లో ఊహించని మలుపు తిరిగింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న భర్తకు తమ కుమారుడి బోన్ మ్యారో సరిపోలకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు ఓ బుటిక్ ద్వారా పరిచయమయ్యారు. ఆమె భర్తకు చికిత్స అవసరం కావడంతో నిందితుడు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని తరచూ అడిగేవాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ రోజు తనను ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. 2020లో ఈ ఘటన జరిగిందని ఆమె తన ఫిర్యాదులో రాసుకొచ్చారు.
అయితే.. ఇటీవల తన భర్తకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో తమ కుమారుడు ఆయనకు జన్యుపరంగా అనుకూలమైన బోన్ మ్యారో దాత కాదనే అనుమానం ఏర్పడినట్లు తెలిపారు. దీంతో ఆమె భర్తకు గతంలో జరిగిన విషయాన్ని చెప్పి, అనంతరం పోలీసులను ఆశ్రయించినట్లు వివరించారు. కేసులో వాస్తవాలను నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం న్యాయస్థానం అనుమతి కోరనున్నట్లు స్థానిక డీఎస్పీ తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ కేసుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు
ఢిల్లీలో మూడో జాతీయ ఏఎన్‌టీఎఫ్ సదస్సు.. ప్రారంభించనున్న అమిత్ షా