ఢిల్లీలో మూడో జాతీయ ఏఎన్‌టీఎఫ్ సదస్సు.. ప్రారంభించనున్న అమిత్ షా
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:13 PM
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో రేపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్ చీఫ్‌ల జాతీయ సదస్సును నిర్వహించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్(ANTF) చీఫ్‌ల 3వ జాతీయ సదస్సును రేపు(మంగళవారం) ఢిల్లీలో నిర్వహించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. దేశంలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి 2026-29 నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్‌లో నిర్దేశించిన లక్ష్యాలపై సదస్సులో చర్చ జరగనుంది. రాష్ట్రాల్లో అమలవుతున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లు, సమాచార మార్పిడి, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పనిచేస్తున్న డ్రగ్ కార్టెల్స్‌ను గుర్తించి, వాటిని ఛేదించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా కొత్త రకాల సింథటిక్ డ్రగ్స్, వాటి తయారీకి ఉపయోగించే సీక్రెట్ ల్యాబొరేటరీస్, అక్రమ సరఫరా నెట్‌వర్క్‌లను గుర్తించి అడ్డుకోవడంపై చర్చించన్నట్టు తెలుస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా సదస్సులో కీలకం కానుంది. డార్క్‌నెట్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ విక్రయాలు, క్రిప్టోకరెన్సీ ఆధారిత లావాదేవీల వంటి నేరాలను గుర్తించడం, వాటిపై సమర్థంగా దర్యాప్తు చేయడం, నిందితుల ఆర్థిక నెట్‌వర్క్‌లను ఛేదించడం వంటివి ఇందులో ఉన్నాయి. ‘యునైటెడ్ రిజాల్వ్ - షేర్డ్ రెస్పాన్సిబిలిటీ’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు.. మాదకద్రవ్యాల నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంస్థలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
హోంమంత్రి అమిత్ షా.. ఈ సదస్సుతో పాటు లఖ్‌నవూ, డెహ్రాడూన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) జోనల్ కాంప్లెక్స్‌లకూ శంకుస్థాపన చేయనున్నారు. మాదకద్రవ్యాలపై నిఘా, దర్యాప్తు, వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ మౌలిక వసతులు కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏఎన్‌టీఎఫ్‌కు అవార్డు అందించనున్నారు. అలాగే పునరుద్ధరించిన ఎన్‌సీబీ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించనున్నారు. ప్రజలకు నార్కోటిక్స్ నియంత్రణ సంబంధిత సమాచారాన్ని మరింత సమర్థంగా అందించేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడనుంది.
ఇవీ చదవండి:
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు బుల్డోజర్లతో స్వాగతం
సాహిల్ సూసైడ్ కేసు.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే యాజమాన్యం